7, డిసెంబర్ 2013, శనివారం

మానవుడే దేవుడు... అదే బౌద్ధం


అది 1900 సంవత్సరం, మార్చి 18వ తేదీ. వేదిక శాన్‌ఫ్రాన్సిస్కో నగర సభ. ప్రాసంగికుడు స్వామీ వివేకానంద. ప్రసంగాంశం: 'ప్రపంచానికి బుద్ధుని సందేశం'. 
ఆ సభలో భారతదేశానికి, ప్రపంచానికి బౌద్ధధర్మం అందించిన అనుపమానమైన దార్శనికదృష్టిని గురించి ప్రస్తావిస్తూ వివేకానందుడు ఇలా అంటాడు: 'చారిత్రకంగా బౌద్ధం అత్యంత ప్రధానమైన ధర్మం'. ఎందుకంటే, ప్రపంచం ఇంతకుముందెన్నడూ చవిచూడని, దాని అనుభవంలోకి రాని అత్యంత శక్తిమంతమైన ధార్మికోద్యమం బౌద్ధం. ప్రపంచ మానవ సమాజాలను అలలు అలలుగా దూసుకువచ్చి ముంచెత్తిన అతి బలీయమైన ఆధ్యాత్మిక తరంగాన్ని ఇంతకుముందెన్నడూ ఈ ప్రపంచం ఎరగదు. ఏదో ఒక విధంగా బౌద్ధ ధర్మ ప్రభావానికి లోనుగాని నాగరికత అంటూ ఈ ప్రపంచంలోనే లేదు. అలాంటి బౌద్ధాన్ని స్వీకరించిన ధర్మానుయాయులు ఏ ఒక్కచోటకో కాదు, ప్రపంచ వ్యాపితంగానే అల్లుకుపోయారు. బుద్ధుని ధర్మ సందేశాన్ని వ్యాప్తి చేశారు. ప్రాక్ప్‌శ్చిమ దిశలకూ, ఉత్తర-దక్షిణ దిక్కులకూ వ్యాపించిపోవడమే కాదు, కాకులు దూరని కారడవిలా ఉన్న చీకటి బుయ్యారం లాంటి టిబెట్‌లోకి చొచ్చుకుపోయారు. పర్షియా, ఆసియా మైనర్‌, రష్యా, పోలెండ్‌లలోకి, పాశ్చాత్య ప్రపంచంలోని అనేక ఇతర దేశాలకు పాకిపోయారు. చైనా, కొరియా, జపాన్‌లలో పాగా వేశారు. బర్మా, సయామ్‌, ఇండోనేషియా, ఈస్టిండీస్‌ దీవులకు, ఆపైనా దూసుకుపోయారు. ఒకవైపు నుండి అలెగ్జాండర్‌ తన సైనిక నివహాలతో విజయయాత్రలు చేస్తూ మధ్యధరా ప్రాంతాన్ని ఇండియాకు దగ్గరగా చేర్చుతున్న సమయంలో భారతీయ విజ్ఞాన సంపదను ఆసియా, యూరప్‌ ఖండాలలోని సువిశాల ప్రాంతాలకు చేర్చడానికి మార్గం సుగమమయింది. దీంతో బౌద్ధ ధర్మ ప్రచారకులు వివిధ దేశాల మధ్య ధర్మవ్యాప్తికోసం నలుమూలలకూ విస్తరించారు. ఇలా బౌద్ధధర్మాన్ని వారు వ్యాప్తి చేస్తున్న కొద్దీ ప్రజలలో మూఢనమ్మకాలూ, పీఠాధిపతులు, మతాధి పతులూ ప్రపంచ భానుడి ముందు కరిగిపోయే పొగ మంచులా కనుమరుగైపోవలసి వచ్చింది అన్నాడు.
అయితే వివేకానందుడిని అంతగా కదిలించిన బౌద్ధ ధర్మమూ, శాక్యముని గౌతమ బుద్ధుడి ప్రవచనాల విశిష్టత ఎందులో ఉంది? కనపడని మాధవుడ్ని కొలుస్తూ, కనిపించే మానవుడ్ని కాలరాస్తున్న కాలమది. 'బ్రాహ్మణాల అవతర ణతో, వాటి ప్రోత్సాహంతో హైందవ సమాజంలో పక్కదారులు తొక్కిన స్వార్ధపరశక్తులు శ్రమకు దూరమై సోమరిపోతులై యజ్ఞయాగాదులు, కర్మకాండ తంతు పేరిట సాగిస్తున్న నరబలులు, జంతు బలుల మధ్య పెంచిన మూఢ విశ్వాసాలతో మానవ సమూహాలను మానసికంగా రోగగ్రస్తుల్ని చేస్తున్న దశ అది. దైవం పేరిట కొడుకుల్ని, కోడళ్లనూ, కూతుళ్లనూ, అల్లుళ్లనూ-తనవారినీ, పెరవారనీ బలిగొనడానికి వెరవని దుర్ముహూర్తాలవి. దేవుడి పేరిట బలహీనజాతుల్ని, దేశాలనూ పీల్చుకుతింటున్న ఘడి యలవి. అదే దైవం పేరిట, భూ మండలాన్ని రక్తమయం చేస్తున్న దుర్దినాలవి. అలాంటి విషమపరిస్థితులలో ప్రపంచచరిత్రలో బౌద్ధం ప్రభావంవల్ల మానవాళి, మొట్టమొదటిసారిగా సరికొత్త నవీన 'దేవుడివైపు దృష్టి మళ్లించింది. ఆ నవీనమూర్తే వాస్తవజగత్తులోని మాన వుడు. అతణ్ణి ప్రపంచానికి ధర్మబోధల ద్వారా అద్దమెత్తి చూపించి మానవుడే దేవుడన్న మహనీయుడు శాక్యముని గౌతమ బుద్ధుడు. మానవుడ్ని తన ధర్మబోధలకు పతాక చిహ్నంగా స్వీకరించి తన మనోమందిరంలో వాడిని ప్రతిష్టించుకుని మానవాళి ఈతిబాధలకు, దుఃఖాలకు, సామాజికుల మధ్య ద్వేషాలకు, కక్షలకు, కార్పణ్యాలకు, అవినీతికి, దోపిడీకి, యుద్ధాలకు, అశాంతికి కారణాలను కనుగొనడానికి రాచరిక భోగాలన్నింటినీ వదిలేసి సంసార జీవితాన్ని త్యజించి, సాధారణ వీధి మానసిగానే ఒంటరిగా వీధికెక్కి జీర్ణ వస్త్రాలతో, సత్వాన్వేషణలో కఠోర తపస్సు కోసం కోనసీమలు తొక్కి, విశ్వమానవ కల్యాణానికి  ధర్మ చింతన అందించిన తథాగతుడు గౌతమ బుద్ధుడు! ఈ సత్యాన్వేషణలోనే ఉన్న బుద్ధుడికి కన్పించిన ఒక ముసలి వాడు, అసమర్థుడైన ఒక రోగి, ఒక మనిషి శవంతోపాటు, సామాజిక అన్యాయాలలో భాగంగా రోహిణీ నదీ జలాల పంపిణీ సందర్భంగా నాటి శాక్యులకు, కొలీయులకు మధ్య దఫదఫాలుగా చెలరేగుతున్న కొట్లాటలు, హత్యలూ, హింసాకాండ, అమితమైన రక్తపాతమూ కూడా ఆయన మనస్సును కలవరపరిచి, కకావికలు చేశాయి. లంచగొండు లైన రాజోద్యోగులు ప్రజల మధ్య జల వివాదాలకు ఆజ్యం పోసిన ఫలితంగా రాచరిక వ్యవస్థ పరిష్కారం చూపడంలో విఫలమైనప్పుడు ఇద్దరు గ్రామాధికారులు కత్తులు దూసు కుంటున్న సమయంలో ఆ ఇరు వర్గాలను శాంతింప చేసేందుకు వెళ్లిన బుద్ధుడు ఆ ఇరువురు తనపైకి లేపిన కత్తులను తన చేత్తోనే ఒడిసి పట్టుకున్నాడు. ఆ సమ యంలో ఆయన చేతులు గాయపడి రక్తసిక్తమైనా అతను చలించలేదు. ఈ ఘటనతో, బుద్ధుడి చొరవతో ఆ యుద్ధమే ఆగిపోయింది.అప్పుడు బుద్ధుడు ఇచ్చిన సందేశం: 'నాకు ఈ దేశం, ఆ దేశం అనే తేడా లేదు. ప్రపంచ మావనాళి అంతా ఏకం కావాలని నా కోరిక. రాజ్యాలు, రాజులు, గొప్పవాళ్లు, తక్కువవాళ్లు, కులాలు, మతాలు, వాటి కోసం నిరంతరం ఘర్షణలు, పరస్పరం సాగుతున్న హత్యలు - ఇవేవీ నాకు నచ్చకే అడవుల కెళ్లి తపస్సు చేశాను.
'బోధి' - జ్ఞానోదయాన్ని సాధించాను' అన్నాడు!
ఆ బుద్ధుని జ్ఞానోదయమే అనంతర కాలంలో మానవాళికి ఆత్మవిశ్వాస సూర్యోదయంగా, వివేక చంద్రోదయంగామారి ఆయనను కారుణ్యమూర్తిగా ప్రసాదించింది. ఈ కల్తీలేని వైజ్ఞానిక వికాసదశకు ఆద్యుడైన బుద్ధుడు, కళంకంలేని ఈ మనోధర్మవ్యాప్తికి భారతభూమిని కేంద్ర బిందువుగా చేసుకొని క్రమంగా ప్రపంచాన్ని తన ధర్మచింతనతో చుట్ట బెడుతున్న శుభముహూర్తాలవి. అందుకే నాటి సకల మతవిశ్వాసాలకు, విభిన్న సంస్కృతులకు, నాటి ప్రజా భాషలలో ధర్మప్రచారానికి ఆలవాలమైన లౌకిక వ్యవస్థే ఆది బౌద్ధం, అసలు హైందవం, అదే హైందవం. అయినప్పుడు, బౌద్ధ ధర్మక్షేత్రంగా వందల,వేల సంవత్సరాలుగా వర్ధిల్లుతూ వచ్చిన భారతదేశం నుంచి బౌద్ధాన్ని సరిహద్దులు దాటించి దేశాన్ని ఆత్మహత్య చేసుకోవటానికి పురిగొల్పిన కారకు లెవరు? ఎవరోకారు,కర్మకాండలు, యజ్ఞయాగాదులు జంతు బలులు, నరబలులను ప్రోత్సహించి స్వార్ధపరులై దారి తప్పిన ఆనాటి ఛాందస మతవర్గీయులు, అహింసను, సత్యాన్వేషణను ప్రబోధిస్తున్న బౌద్ధధర్మంపైన విరుచుకు పడి, బౌద్ధారామాలను, చైత్యాలను, బౌద్ధ విహారాలను ఆంధ్రలో సహా పెక్కుచోట్ల ధ్వంసం చేశారు. బౌద్ధానికి పూర్వం హేతువాదులయిన చార్వాక, లోకాయతులు, కపిలడా, కాణాది భౌతికవాదుల సత్య సందేశాలను కూడా వ్యతిరేకించిన ఛాందస మతాచార్యుల నుంచి వారి శిష్యు గణాల నుంచి బౌద్ధంపై విద్వేష ప్రచారం ద్వారా వ్యతిరేకత ప్రబలినందువల్లే కుమారిలుడు,శంకరాచార్యుడు కూడా బౌద్ధ వ్యతిరేక యాత్రలు ముమ్మరం చేశారని మరువరాదు!

10, జులై 2013, బుధవారం

బహుబలి

బహుబలి
మనదేశం భిన్నమతాలకు ఆలవాలం హైందవ, ముస్లిం,కైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ సంస్కృతులు ఈ నేలలో ఫరిఢవిల్లారు. చారిత్రక కట్టడాల రూపంలో సంస్కృతుల చిహ్నాలు... దేశవ్యాప్తంగా నేడు ప్రసిద్ధ పర్యాటక ేకంద్రాలుగా వెలుగొందుతున్నారు. వందల, వేల ఏళ్ళనాడే భారతావనిలో జైన మతం విశేష ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా రాజస్థాన్‌, కర్ణాటక రాషాట్రల్లో అనేక దేవాలయాలు, సంస్కృతి చిహ్నాలు మనకు దర్శనమిస్తారుు. అలాంటి వాటిలో పేరెన్నికగన్నదే ‘శ్రావణ బెళగొళ’... దేశంలోనే పెద్దదైన ‘బాహుబలి’ విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. జైన సంస్కృతీ సంపదను కళ్ళకు కడుతున్న కర్ణాటకలోని ‘శ్రావణ బెళగొళ’ విశేషాలు...

 
రెండు కొండల మధ్య ప్రృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే బెళగొళ కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు. అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్యాణం పొందడానికి ఈ కొండలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు. శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను ‘శ్రమణ బెళగొళ’ అనేవారు. క్రమంగా ‘శ్రావణ బెళగొళ’గా మారింది. స్థానికులు ‘బెళగొళ’ అనే పిలుస్తారు. చంద్రగిరి, ఇంద్రగిరి కొండల మధ్య ఉన్న బెళగొళను చుడడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు.
భారీ గోమఠేశ్వరుడు
ఇక్కడ ఉన్న 58 అడుగుల బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీశ 983వ సంవత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం. దీనికే గోమఠేశ్వరుని ఆలయంగా వాడుక. ఇక్కడ ఆలయం కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్టించడం జరగలేదు. కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుని విగ్రహాన్ని చెక్కడంలో శిల్పి అర్త్సమేణి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూడాల్సిందే. ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు. ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అల్లుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. మనం విగ్రహం దగ్గర నిలబడితే బాహుబలి పాదం ఎత్తుకు సరిపోతాం.
కనులకు విందు... మస్తకాభిషేకం
12 ఏళ్ళకొకసారి జరిగే మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషేకం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే అభిషేకించగలం. గోమఠేశ్వరునికి క్యాన్ల కొద్దీ పలు, తేనె, పెరుగు, అన్నం, కొబ్బరి పాలు, నెయ్యి, చక్కెర, బాదం పప్పు, కుంకుమ పువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూట్స్‌, పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్‌ కడతారు. దీని మీదకు వెళ్ళి అభిషేకం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభిషేకం సమయంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆలయం కొండమీద ఉంటుంది. ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయినా ఎక్కడం కొంచెం కష్టమే. మెట్లు ఎత్తుగా ఉండడంతో యువకులు కూడా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎక్కుతారు. మొత్తం మీద పదిహేను-ఇరవై నిమిషాల తరువాత కొండపైకి చేరుకుంటారు....

బాహుబలి చరిత్ర :
 
గోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు (రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు ఋషబుడని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు. స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి, అంతలోనే పునరాలోచనలో పడతాడు. ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.
జైన విశిష్టత :
 
మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విస్తృతం కాలేదు. జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు. శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు. వీరు సంసార జీవితం కొనసాగిస్తారు. దిగంబరులు సన్యాసులు. వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని ృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.
అంతా శాసనాలమయం
బాహుబలి విగ్రహం తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే. జైన తీర్థంకరుల దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చంద్రగిరి పర్వతం మీద అశోకుడు నిర్మించినట్లు నిర్మించినట్లు చెబుతున్న చంద్రగుప్త బస్తీ ముఖ్యమైనది. ఇందులో సెమీ ప్రిషియస్‌ స్టోన్స్‌ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు. చరిత్ర పరిశోధకులు 523 శాసనాలను గుర్తించారు. ఇందులో చిన్న కొండ మీద 271,ె పద్ద కొండ మీద 172, 80 శాసనాలు బెళగొళలో, మరో 50 బెళగొళ పరిసర గ్రామాల్లో ఉన్నాయి. ఇవన్ని కూడా క్రీశ 600-19వ శతాబ్దం మధ్యనాటివే. లెక్కకు మించిన శాసనాలే కాక లెక్కలేనన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. జైనతీర్థాంకురుల స్మృతి చిహ్నాలుగా పర్యాకులను ఆకర్షిస్తాయి.
ఇలా వెళ్లాలి :
 
శ్రావణ బెళగొళ కర్నాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో ఉంది.బెంగుళూరుకు పశ్చిమంగా 146కి.మీ.దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి 11కి.మీ.దూరంలో ఉన్న చెన్నరాయ పట్టణం ప్రధాన కేంద్రం. ఇక్కడికి అన్ని ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బెంగుళూరు-మంగుళూరు హైవే రూట్‌లో వస్తుంది. రైల్వే ద్వారా చేరాలంటే హసన్‌ రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలి. ఇక విమానయానం ద్వారా వచ్చే ప్రయాణీకులు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా చేరాలి. యాత్రికులు బెళగొళలో పర్యటించడానికి అవసరమైన సమగ్ర సమాచారం కోసం ఇక్కడ ఉన్న జైనమఠం అడ్రస్‌లో సంప్రదించవచ్చు.