7, డిసెంబర్ 2013, శనివారం

మానవుడే దేవుడు... అదే బౌద్ధం






అది 1900 సంవత్సరం, మార్చి 18వ తేదీ. వేదిక శాన్‌ఫ్రాన్సిస్కో నగర సభ. ప్రాసంగికుడు స్వామీ వివేకానంద. ప్రసంగాంశం: 'ప్రపంచానికి బుద్ధుని సందేశం'. 
ఆ సభలో భారతదేశానికి, ప్రపంచానికి బౌద్ధధర్మం అందించిన అనుపమానమైన దార్శనికదృష్టిని గురించి ప్రస్తావిస్తూ వివేకానందుడు ఇలా అంటాడు: 'చారిత్రకంగా బౌద్ధం అత్యంత ప్రధానమైన ధర్మం'. ఎందుకంటే, ప్రపంచం ఇంతకుముందెన్నడూ చవిచూడని, దాని అనుభవంలోకి రాని అత్యంత శక్తిమంతమైన ధార్మికోద్యమం బౌద్ధం. ప్రపంచ మానవ సమాజాలను అలలు అలలుగా దూసుకువచ్చి ముంచెత్తిన అతి బలీయమైన ఆధ్యాత్మిక తరంగాన్ని ఇంతకుముందెన్నడూ ఈ ప్రపంచం ఎరగదు. ఏదో ఒక విధంగా బౌద్ధ ధర్మ ప్రభావానికి లోనుగాని నాగరికత అంటూ ఈ ప్రపంచంలోనే లేదు. అలాంటి బౌద్ధాన్ని స్వీకరించిన ధర్మానుయాయులు ఏ ఒక్కచోటకో కాదు, ప్రపంచ వ్యాపితంగానే అల్లుకుపోయారు. బుద్ధుని ధర్మ సందేశాన్ని వ్యాప్తి చేశారు. ప్రాక్ప్‌శ్చిమ దిశలకూ, ఉత్తర-దక్షిణ దిక్కులకూ వ్యాపించిపోవడమే కాదు, కాకులు దూరని కారడవిలా ఉన్న చీకటి బుయ్యారం లాంటి టిబెట్‌లోకి చొచ్చుకుపోయారు. పర్షియా, ఆసియా మైనర్‌, రష్యా, పోలెండ్‌లలోకి, పాశ్చాత్య ప్రపంచంలోని అనేక ఇతర దేశాలకు పాకిపోయారు. చైనా, కొరియా, జపాన్‌లలో పాగా వేశారు. బర్మా, సయామ్‌, ఇండోనేషియా, ఈస్టిండీస్‌ దీవులకు, ఆపైనా దూసుకుపోయారు. ఒకవైపు నుండి అలెగ్జాండర్‌ తన సైనిక నివహాలతో విజయయాత్రలు చేస్తూ మధ్యధరా ప్రాంతాన్ని ఇండియాకు దగ్గరగా చేర్చుతున్న సమయంలో భారతీయ విజ్ఞాన సంపదను ఆసియా, యూరప్‌ ఖండాలలోని సువిశాల ప్రాంతాలకు చేర్చడానికి మార్గం సుగమమయింది. దీంతో బౌద్ధ ధర్మ ప్రచారకులు వివిధ దేశాల మధ్య ధర్మవ్యాప్తికోసం నలుమూలలకూ విస్తరించారు. ఇలా బౌద్ధధర్మాన్ని వారు వ్యాప్తి చేస్తున్న కొద్దీ ప్రజలలో మూఢనమ్మకాలూ, పీఠాధిపతులు, మతాధి పతులూ ప్రపంచ భానుడి ముందు కరిగిపోయే పొగ మంచులా కనుమరుగైపోవలసి వచ్చింది అన్నాడు.
అయితే వివేకానందుడిని అంతగా కదిలించిన బౌద్ధ ధర్మమూ, శాక్యముని గౌతమ బుద్ధుడి ప్రవచనాల విశిష్టత ఎందులో ఉంది? కనపడని మాధవుడ్ని కొలుస్తూ, కనిపించే మానవుడ్ని కాలరాస్తున్న కాలమది. 'బ్రాహ్మణాల అవతర ణతో, వాటి ప్రోత్సాహంతో హైందవ సమాజంలో పక్కదారులు తొక్కిన స్వార్ధపరశక్తులు శ్రమకు దూరమై సోమరిపోతులై యజ్ఞయాగాదులు, కర్మకాండ తంతు పేరిట సాగిస్తున్న నరబలులు, జంతు బలుల మధ్య పెంచిన మూఢ విశ్వాసాలతో మానవ సమూహాలను మానసికంగా రోగగ్రస్తుల్ని చేస్తున్న దశ అది. దైవం పేరిట కొడుకుల్ని, కోడళ్లనూ, కూతుళ్లనూ, అల్లుళ్లనూ-తనవారినీ, పెరవారనీ బలిగొనడానికి వెరవని దుర్ముహూర్తాలవి. దేవుడి పేరిట బలహీనజాతుల్ని, దేశాలనూ పీల్చుకుతింటున్న ఘడి యలవి. అదే దైవం పేరిట, భూ మండలాన్ని రక్తమయం చేస్తున్న దుర్దినాలవి. అలాంటి విషమపరిస్థితులలో ప్రపంచచరిత్రలో బౌద్ధం ప్రభావంవల్ల మానవాళి, మొట్టమొదటిసారిగా సరికొత్త నవీన 'దేవుడివైపు దృష్టి మళ్లించింది. ఆ నవీనమూర్తే వాస్తవజగత్తులోని మాన వుడు. అతణ్ణి ప్రపంచానికి ధర్మబోధల ద్వారా అద్దమెత్తి చూపించి మానవుడే దేవుడన్న మహనీయుడు శాక్యముని గౌతమ బుద్ధుడు. మానవుడ్ని తన ధర్మబోధలకు పతాక చిహ్నంగా స్వీకరించి తన మనోమందిరంలో వాడిని ప్రతిష్టించుకుని మానవాళి ఈతిబాధలకు, దుఃఖాలకు, సామాజికుల మధ్య ద్వేషాలకు, కక్షలకు, కార్పణ్యాలకు, అవినీతికి, దోపిడీకి, యుద్ధాలకు, అశాంతికి కారణాలను కనుగొనడానికి రాచరిక భోగాలన్నింటినీ వదిలేసి సంసార జీవితాన్ని త్యజించి, సాధారణ వీధి మానసిగానే ఒంటరిగా వీధికెక్కి జీర్ణ వస్త్రాలతో, సత్వాన్వేషణలో కఠోర తపస్సు కోసం కోనసీమలు తొక్కి, విశ్వమానవ కల్యాణానికి  ధర్మ చింతన అందించిన తథాగతుడు గౌతమ బుద్ధుడు! ఈ సత్యాన్వేషణలోనే ఉన్న బుద్ధుడికి కన్పించిన ఒక ముసలి వాడు, అసమర్థుడైన ఒక రోగి, ఒక మనిషి శవంతోపాటు, సామాజిక అన్యాయాలలో భాగంగా రోహిణీ నదీ జలాల పంపిణీ సందర్భంగా నాటి శాక్యులకు, కొలీయులకు మధ్య దఫదఫాలుగా చెలరేగుతున్న కొట్లాటలు, హత్యలూ, హింసాకాండ, అమితమైన రక్తపాతమూ కూడా ఆయన మనస్సును కలవరపరిచి, కకావికలు చేశాయి. లంచగొండు లైన రాజోద్యోగులు ప్రజల మధ్య జల వివాదాలకు ఆజ్యం పోసిన ఫలితంగా రాచరిక వ్యవస్థ పరిష్కారం చూపడంలో విఫలమైనప్పుడు ఇద్దరు గ్రామాధికారులు కత్తులు దూసు కుంటున్న సమయంలో ఆ ఇరు వర్గాలను శాంతింప చేసేందుకు వెళ్లిన బుద్ధుడు ఆ ఇరువురు తనపైకి లేపిన కత్తులను తన చేత్తోనే ఒడిసి పట్టుకున్నాడు. ఆ సమ యంలో ఆయన చేతులు గాయపడి రక్తసిక్తమైనా అతను చలించలేదు. ఈ ఘటనతో, బుద్ధుడి చొరవతో ఆ యుద్ధమే ఆగిపోయింది.అప్పుడు బుద్ధుడు ఇచ్చిన సందేశం: 'నాకు ఈ దేశం, ఆ దేశం అనే తేడా లేదు. ప్రపంచ మావనాళి అంతా ఏకం కావాలని నా కోరిక. రాజ్యాలు, రాజులు, గొప్పవాళ్లు, తక్కువవాళ్లు, కులాలు, మతాలు, వాటి కోసం నిరంతరం ఘర్షణలు, పరస్పరం సాగుతున్న హత్యలు - ఇవేవీ నాకు నచ్చకే అడవుల కెళ్లి తపస్సు చేశాను.
'బోధి' - జ్ఞానోదయాన్ని సాధించాను' అన్నాడు!
ఆ బుద్ధుని జ్ఞానోదయమే అనంతర కాలంలో మానవాళికి ఆత్మవిశ్వాస సూర్యోదయంగా, వివేక చంద్రోదయంగామారి ఆయనను కారుణ్యమూర్తిగా ప్రసాదించింది. ఈ కల్తీలేని వైజ్ఞానిక వికాసదశకు ఆద్యుడైన బుద్ధుడు, కళంకంలేని ఈ మనోధర్మవ్యాప్తికి భారతభూమిని కేంద్ర బిందువుగా చేసుకొని క్రమంగా ప్రపంచాన్ని తన ధర్మచింతనతో చుట్ట బెడుతున్న శుభముహూర్తాలవి. అందుకే నాటి సకల మతవిశ్వాసాలకు, విభిన్న సంస్కృతులకు, నాటి ప్రజా భాషలలో ధర్మప్రచారానికి ఆలవాలమైన లౌకిక వ్యవస్థే ఆది బౌద్ధం, అసలు హైందవం, అదే హైందవం. అయినప్పుడు, బౌద్ధ ధర్మక్షేత్రంగా వందల,వేల సంవత్సరాలుగా వర్ధిల్లుతూ వచ్చిన భారతదేశం నుంచి బౌద్ధాన్ని సరిహద్దులు దాటించి దేశాన్ని ఆత్మహత్య చేసుకోవటానికి పురిగొల్పిన కారకు లెవరు? ఎవరోకారు,కర్మకాండలు, యజ్ఞయాగాదులు జంతు బలులు, నరబలులను ప్రోత్సహించి స్వార్ధపరులై దారి తప్పిన ఆనాటి ఛాందస మతవర్గీయులు, అహింసను, సత్యాన్వేషణను ప్రబోధిస్తున్న బౌద్ధధర్మంపైన విరుచుకు పడి, బౌద్ధారామాలను, చైత్యాలను, బౌద్ధ విహారాలను ఆంధ్రలో సహా పెక్కుచోట్ల ధ్వంసం చేశారు. బౌద్ధానికి పూర్వం హేతువాదులయిన చార్వాక, లోకాయతులు, కపిలడా, కాణాది భౌతికవాదుల సత్య సందేశాలను కూడా వ్యతిరేకించిన ఛాందస మతాచార్యుల నుంచి వారి శిష్యు గణాల నుంచి బౌద్ధంపై విద్వేష ప్రచారం ద్వారా వ్యతిరేకత ప్రబలినందువల్లే కుమారిలుడు,శంకరాచార్యుడు కూడా బౌద్ధ వ్యతిరేక యాత్రలు ముమ్మరం చేశారని మరువరాదు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి