10, జులై 2013, బుధవారం

శాలిహుండం

శాలిహుండం
ఆంధ్రదేశంలో ఉన్న సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి శాలి హుండం. శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో... వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ద ఆరామాలు శిథిలమైన దేవాలయాలతో కనువిందు చేస్తూ ప్రకృతి రమణీయత కళ్ళకు కట్టే పర్యాటక స్థలం, అందమైన క్షేత్రం శాలిహుండం. పూర్వం శాలిహుండానికి శాలివాటిక (బియ్యపు ధాన్యాగారం) అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక (ఎముకల పెట్టె) అని కూడా పిలిచేవారు.
శాలిహుండం వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగ పట్నానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శాలిహుండంలోని శిథిలాలు చాలామటుకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు.
శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు. ఆ తరువాత ఈ ప్రదేశంలో ఎ.హెచ్‌.లాంగ్‌హర్ట్‌‌స, టి.ఎన్‌.రామచంద్రన్‌, ఆర్‌.సుబ్రహ్మణ్యన్‌ తదితరులు త్రవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు. త్రవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహం, అనేక శిల్పాలు బయటపడ్డాయి. క్రీపూ 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన, హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి