24, డిసెంబర్ 2012, సోమవారం

ఆంధ్రలో బౌద్ధమత వ్యాప్తి

ఆంధ్రలో బౌద్ధమత వ్యాప్తి

 ఆంధ్రాలో బౌద్ధమత వ్యాప్తి ప్రపంచ చరిత్రలో క్రీ.పూ. ఆరో శతాబ్దానికి ప్రత్యేకత ఉంది. వేద యుగంలో పెరిగిన జీవహింస, ఖర్చుతో కూడిన యజ్ఞ యాగాలు, క్రతువులు, సమాజంలో పేరుకుపోయిన వర్ణ వివక్ష, మత వైషమ్యాలు, ఆర్థిక అసమానతలు ఆలోచనాపరులైన కొద్దిమందిలో జిజ్ఞాసను రేకెత్తించాయి. వీటిని అధిగమించడానికి అజీవకులు, చార్వాకులు, జైన, బౌద్ధ మతకర్తలైన.. మహావీరుడు, బుద్ధుడు వంటివారు క్రీ.పూ 6వ శతాబ్దంలో భావవికాసానికి నాంది పలికారు.

అటు యూరప్‌లో, ఇటు ఆసియాలోనూ తీవ్ర చింతాన్వేషణలు సాగాయి. ఫలితంగా సనాతన మృత సంప్రదాయాలను ధిక్కరించే నూతన మతాలు వెలిశాయి. ఆర్య సంస్కృతిపై ‘అనార్య వర్గాలు’ లేవనెత్తిన తిరుగుబాటు బావుటాలే జైన, బౌద్ధ మతాలని కొందరు చరిత్రకారుల భావన. ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఇతర వర్ణాల వారు చేసిన తిరుగుబాటని మరికొంతమంది చరిత్రకారులు భావించారు. ఈ తాత్త్విక ధోరణులే 6వ శతాబ్దం నాటికి యుగధర్మంగా రూపొందాయి.
జైనమతం: మహావీరుడు క్రీ.పూ. 540-468 కాలానికి చెందినవాడు. జైనమతానికి 24 మంది తీర్థంకరులు ఆధ్వర్యం వహించారు. రుగ్వేదంలో ప్రస్తావించిన ‘రుషభనాధుడు’ మొదటి తీర్థంకరుడు, మత స్థాపకుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాధుడు, చారిత్రక పురుషుడు. చారిత్రకంగా ఇతడే జైనమతాన్ని స్థాపించాడని ప్రతీతి. ఇరవై నాల్గో తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇతడే చివరివాడు. ‘తీర్థంకరుడు’ అంటే మోక్షానికి మార్గదర్శకుడు. మహావీరుడు క్రీ.పూ. 540 ప్రాంతంలో వైశాలీ నగరంలోని కుంద గ్రామంలో జన్మించాడు. జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. సిద్ధార్థ, త్రిశల ఇతడి తల్లిదండ్రులు. భార్య పేరు యశోద. 30 ఏళ్ల వయసులో మహావీరుడు గృహస్థ జీవితాన్ని పరిత్యజించాడు. అజీవక మత స్థాపకుడైన మక్కలి గోశాలుడు ఇతడి తాత్త్విక గురువు. మహావీరుడు 12 ఏళ్లు సత్యాన్వేషణ చేసి, చివరకు క్రీ.పూ. 498లో మహాజ్ఞాని అయ్యాడు. 30 ఏళ్ల పాటు జైనమతాన్ని ప్రచారం చేసి, క్రీ.పూ. 468లో తన 72వ ఏట ‘పావపురి’ వద్ద తనువు చాలించాడు. ‘రిజుపాలిక’ నది ఒడ్డున జృంభిక అనే గ్రామం వద్ద తపస్సు చేశాడు. ఏడాది తర్వాత జ్ఞానోదయం పొందాడు. జినుడు, కేవలుడని మహావీరునికి పేరొచ్చింది. జైనులను ‘నిర్గంధులని’ కూడా పిలుస్తారు.
మహావీరుని బోధనలు: 1. వైదిక కర్మలు చేయడం, దేవుణ్ని వేడుకోవడం వల్ల మనిషికి ఉపయోగం లేదు. 2. చెడు చేయకుండా మంచి జీవితాన్ని గడపడమే మోక్ష మార్గం. 3. జైనమత ప్రకారం ‘ఆత్మ’ ప్రాణులకే కాదు, ప్రతి వస్తువులోను ఉంటుంది. దేవుడితో నిమిత్తం లేదు. 4. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర- మోక్ష మార్గాలు. వీటిని ‘త్రిరత్నాలు’ అంటారు. (సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడి) 5. పార్శ్వనాధుడు ప్రతిపాదించిన సత్య, అహింస, అపరిగ్రహ, అనస్తేయ అనే నాలుగు మూల సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్య సూత్రాన్ని అదనంగా జోడించాడు. వీటిని ‘పంచానువ్రత’ అని పిలుస్తారు. 6. జైనమతం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించింది. జైనమత చిహ్నాలు: రుషభనాధుని చిహ్నం వృషభం. పార్శ్వనాధుని చిహ్నం సర్పం. వర్ధమాన మహావీరుని చిహ్నం సింహం. నేమినాధుని చిహ్నం శంఖం.
జైన సంఘాలు: మొదటి జైన సమావేశం (జైన పరిషత్) పాటలీపుత్రంలో క్రీ.పూ. 300 ప్రాంతంలో స్థూల భద్రుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ జైన పరిషత్‌లో జైనమత 12 అంగాలు సంకలనం చేశారు. జైనమత పవిత్ర గ్రంథాలను ‘అంగాలు’ అని పిలుస్తారు. జైనమతం శ్వేతాంబరులు, దిగంబరులు అనే రెండు శాఖలుగా విడిపోయింది. శ్వేతాంబరుల నాయకుడు స్థూలభద్రుడు. దిగంబరుల నాయకుడు భద్రబాహుడు. పార్శ్వనాధుడు శ్వేతాంబర వాదాన్ని, మహావీరుడు దిగంబర వాదాన్ని సమర్థించారు. రెండో జైన పరిషత్ వల్లభిలో నిర్వహించారు.
దీని అధ్యక్షుడు దేవరధి క్షమశ్రమణుడు. జైనమత గ్రంథాలు ప్రాకృత భాషలో రచించారు. మహావీరుడు తన బోధనలను అర్ధమాగధి భాషలో ప్రచారం చేశాడు. భద్రబాహుడు కల్ప సూత్రాలను రచించాడు. దిగంబరుల నాయకుడైన భద్రబాహుడుతో కలిసి మౌర్యచంద్రగుప్తుడు శ్రావణబెళగొళ వెళ్లి అక్కడే మరణించాడు. మహావీరుని అనుచరులను నిగ్రంధులు అంటారు (బంధాల నుంచి విముక్తి పొందిన వారు).
జైన సాహిత్యం: రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు. ఇతడు కన్నడ భాషలో రత్నపాంచాలిక, కవిరాజమార్గం రచించాడు. చాళుక్య రాజుల ఆస్థానంలో ఉన్న హేమచంద్రుడు త్రిశస్తిలక పురుష చరిత్ర రాశాడు. జైన మతాచార్యుడు కొండకుందాచారి- ప్రచనాసారం, సమయసారం గ్రంథాలు రచించాడు. హేమచంద్రుడు ‘పరిశిష్ట పర్వాన్ని’ రాశాడు.
ప్రసిద్ధి గాంచిన జైన కట్టడాలు: ఆంధ్ర దేశంలో నల్గొండ జిల్లాలోని కొలనుపాక జైనుల ముఖ్య క్షేత్రం. జైనుల దేవాలయాలను బసదులు (వసతులు)గా పిలుస్తారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘జైన దిల్వారా జైన మందిరాలు’ రాజస్తాన్ అబూ పర్వతం దగ్గర నిర్మించారు.
ఒరిస్సాలో ఉదయగిరి, మహారాష్ట్రలో ఎల్లోరా గుహలు ప్రసిద్ధి గాంచాయి. జైనులు పూజించే స్త్రీ దేవతను ‘విద్యాదేవి’ అని పిలుస్తారు. జైన మతంలో సల్లేఖనం (శరీరాన్ని క్షీణించుకొని మరణించడం) ద్వారా పరమపదం చేరుకోవడం ఆచారం. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం ద్వారా పరమపదించాడు. భారతీయ వాస్తు-శిల్ప కళాభివృద్ధికి జైనమతం గొప్ప సేవ చేసింది.
బౌద్ధమతం: గౌతముడు (సిద్ధార్థుడు) క్రీ.పూ. 567లో కపిలవస్తు పట్టణానికి కొంత దూరంలో ఉన్న ‘లుంబిని’ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి శుద్దోధనుడు శాక్య తెగకు అధిపతి. తల్లి మాయాదేవి కోలియ తెగకు చెందింది. తల్లి మరణించడంతో సిద్ధార్థుడు మహాప్రజాపతి గోతమి చేతుల్లో పెరిగాడు.
అందుకే గౌతముడని కూడా అంటారు. శాక్యముని తథాగతుడు, సిద్ధార్థుడు అని కూడా పిలుస్తారు. సిద్ధార్థుని భార్య యశోధర, కుమారుడు రాహులుడు. చిన్ననాటి నుంచి తాత్త్విక చింతన, తార్కిక బుద్ధి ఎక్కువ. ఆరేళ్లు రాజగృహలో విద్య నభ్యసించాడు.
గయ (ఉరువేల) వద్ద సత్యాన్వేషణ కోసం 49 రోజుల పాటు కఠోర తపస్సు చేసి, బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు. క్రీ.పూ. 6వ శతాబ్దంలో బౌద్ధ మతం స్థాపించి బహుళ ప్రచారంలోకి తెచ్చాడు. బుద్ధుడు సార్‌నాథ్ వద్ద మృగదావనంలో (ఉత్తరప్రదేశ్) తొలిసారిగా ఐదుగురు శిష్యులకు బౌద్ధ ధర్మం బోధించాడు. బుద్ధుడు బోధించిన జ్ఞానాన్ని ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. ఈ ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం ఉంది, ఆ కారణానికి పరిష్కారం ఉంది, ఆ పరిష్కారం అష్టాంగ మార్గం (ఎనిమిది సూత్రాలు).
అవి.. 1) సరైన దృష్టి 2) సరైన లక్ష్యం 3) సద్భాషణ 4) సత్కార్యం 5) సరైన జీవనం 6) సరైన కృషి 7) సరైన చైతన్యం 8) సరైన ధ్యానం.
ఎటువంటి సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తై అష్టాంగ మార్గాలు అనుసరిస్తే ముక్తి పొందొచ్చని బోధించాడు. బుద్ధం, ధమ్మం (ధర్మం), సంఘం వీటిని త్రిరత్నాలు అంటారు. బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. మనిషి మరణాంతరం కర్మ వెంటాడుతూనే ఉంటుందన్నాడు. కర్మకు కారణమైన కోరికను త్యజించడం ద్వారా మనిషి నిర్వాణం పొందగలడని బౌద్ధం చెబుతుంది. అజ్ఞానం ఊహా కల్పనకు కారణం. ఊహా కల్పనతో స్వీయచిత్తం కలుగుతుంది. దీని నుంచి స్పర్శ, భావన, కామన, సంగత్వం, అహంకారం, పునర్జన్మ ఒకదాని కారణంగా మరొకటి గొలుసుకట్టుగా పరిణమిస్తాయని బుద్ధుడు ప్రతిపాదించాడు. దీన్నే ప్రతీత్యసముత్పాదం అన్నాడు. అహింస, కరుణ, మైత్రి, ముదిత వంటి విషయాలకే బుద్ధుడు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ‘బహుజన సుఖాయ-బహుజన హితాయ’ సూత్రాన్ని నిత్య జీవితంలోకి అనువదించాడు. ప్రతి వ్యక్తి విశ్వమానవ కళ్యాణానికి పాటు పడాలని బుద్ధుడు ప్రబోధించాడు. భగవంతుడ్ని, ఆత్మ, వేదాలు, వర్ణ వ్యవస్థను బుద్ధుడు తిరస్కరించాడు.
మగధ, కోసల రాజ్యాల్లో బుద్ధుడు విస్తృతంగా పర్యటించి తన బోధనలను అర్ధమాగధి భాషలో ప్రబోధించాడు. అజాతశత్రువు, ప్రసేనజిత్తుడు, బింబిసారుడు బుద్ధుడికి సమకాలికులు. వీరు బౌద్ధాన్ని ఆదరించారు. కర్మకాండలు, వేదాల ప్రామాణికతను తిరస్కరించే అజితకేశకంబలి, పాకుదకాత్యాయన, మక్కలిగోసాలుడు మొదలైన తాత్త్వికులంతా ఈ కాలానికి చెందినవారే. బుద్ధుడు తన 80వ ఏట కుశీనగరంలో పరమపదించాడు.
బౌద్ధ సంఘ సమావేశాలు (సంగీతులు): ప్రథమ బౌద్ధ సంఘ సమావేశం (సంగీతి) రాజగృహలో నిర్వహించారు. దీని అధ్యక్షుడు మహాకాశ్యపుడు. అజాతశత్రువు దీన్ని ఆదరించాడు. సుత్త, వినయ పీఠకాలు, బౌద్ధ సాహిత్యం ఈ సమావేశ కాలంలో సంకలనం చేశారు.
రెండో బౌద్ధ సమావేశంలో బౌద్ధ మతస్థులు- స్థవిరవాదులు, మహాసాంఘికులుగా విడిపోయారు. ఈ సమావేశం వైశాలీలో నిర్వహించారు. దీని అధ్యక్షుడు సభాకామి. మూడో బౌద్ధ సమావేశం క్రీ.పూ. 250 ప్రాంతంలో పాటలీపుత్రలో నిర్వహించారు. దీనికి మొగ్గలి పుత్రతిస్యుడు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈ సమావేశంలో ‘అభిదమ్మ పీఠిక’ను సంకలనం చేశారు.
క్రీ.శ. 1వ శతాబ్దంలో నాల్గో బౌద్ధ సమావేశం కాశ్మీర్‌లోని కుందలవనంలో నిర్వహించారు. దీని అధ్యక్షుడు వసుమిత్రుడు. కనిష్కుడు దీన్ని ఆదరించాడు. ఈ బౌద్ధ సంగీతి సమావేశంలోనే బౌద్ధం- హీనయానం, మహాయానంగా చీలిపోయింది. మహాయాన బౌద్ధానికి ఆచార్య నాగార్జునుడు మూల పురుషుడు. నాగార్జునుడు ప్రజ్ఞాపారమిత, మూల మాధ్యమిక కారిక గ్రంథాలు రచించాడు. క్రీ.శ. 6వ శతాబ్దంలో వజ్రయాన అనే తాంత్రిక శాఖ ఏర్పడింది. బుద్ధుడి జీవిత చరిత్రకు సంబంధించిన పుట్టుక, పరిత్యాగం, జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరి నిర్వాణం సంఘటనలను ‘పంచకళ్యాణాలు’ అని అంటారు.
బౌద్ధ సాహిత్యం: బౌద్ధమత పవిత్ర గ్రంథాలను ‘త్రిపీఠకాలు’ అంటారు. వీటిని పాళీ భాషలో రచించారు. త్రిపీఠకాల్లో ముఖ్యమైంది సుత్త పీఠకం. సంస్కృత భాషలో అశ్వఘోషుడు బుద్ధ చరిత, సౌందరనందనం వంటి కావ్యాలు రచించాడు. బుద్ధుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించే కథలను ‘జాతక కథలు’ అంటారు. బుద్ధుడి జననాన్ని సూచించే సంజ్ఞ ‘ఏనుగు’. పరిత్యాగాన్ని సూచించేది ‘గుర్రం’. జ్ఞానోదయాన్ని సూచించేది ‘బోధి వృక్షం’. బుద్ధుడి ధర్మప్రసంగాన్ని సూచించేది ‘చక్రం’. మహాపరి నిర్యాణాన్ని సూచించే సంజ్ఞ ‘స్థూపం’.
తెలుగు నాట బౌద్ధ సంస్కృతి: గౌతమ బుద్ధుడు స్వయంగా ధాన్యకటకం (అమరావతి) వద్ద కాలచక్రతంత్రం ప్రవర్తింప చేశాడని, ధారణులను నిక్షిప్తం చేశాడని, అందువల్ల అమరావతి ధరణికోట అయ్యిందని జర్మన్ పండితుడు ‘హాలెంట్ హోప్‌మాన్’ తన పరిశోధనలో వెల్లడించాడు. అమరావతి స్థూపంలో బుద్ధుడి ధాతువులను నిక్షిప్తం చేసినట్లు ‘మంజుశ్రీ మూలకల్పం’ బౌద్ధ గ్రంథం పేర్కొంది.
ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన భట్టిప్రోలు స్థూపంలో భట్టిప్రోలు శాసనం ప్రకారం ‘బుద్ధ శరీరాన్ని నిక్షిప్తం’ అని రాశారు. ఈ శాసనంలోనే కుబేరక అనే రాజు ప్రస్తావన ఉంది. ఆంధ్ర దేశంలో సుమారు వంద బౌద్ధ స్థలాలను పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు.
భట్టిప్రోలు, అమరావతి, నాగార్జునకొండ, ఘంటశాల, జగ్గయ్యపేట, ఆదుర్రు, శాలిహుండం, ఫణిగిరి, చందవరం, రామతీర్థం, శంకరం, కోటిలింగాల, కొండాపూర్, పెదగంజాం, చినగంజాం మొదలైన ప్రాంతాల్లో స్థూపాలు, చైత్యగృహాలు, విహారాలు బయల్పడ్డాయి. అశోకుడి శిలా శాసనాలు ఆంధ్ర దేశంలో కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, రాజులమందగిరిల్లో లభించాయి. ఇటీవల విశాఖపట్నం జిల్లా బావికొండ దగ్గర బుద్ధుడి పవిత్ర ధాతువులు లభించాయి. కరీంనగర్ జిల్లా ధూళకట్టలో స్థూపం బయటపడింది. శ్రీకాకుళంలో వంశధార నది ఒడ్డున శ్రీముఖలింగ శైవ క్షేత్రం ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో క్రీ.శ 8, 9 శతాబ్దాల నాటి అమితాబ, అక్షోభ్య (బుద్ధుడు), ఉపనీహవిషయ(స్త్రీ)మూర్తులు బయల్పడ్డాయి. ఇవి బౌద్ధమతానికి చెందినవి. నల్కొండ జిల్లా ఫణిగిరిలో గాజులబండ, తిరుమలగిరి ప్రాంతాల్లో బౌద్ధ అవశేషాలు లభ్యమయ్యాయి.

1 కామెంట్‌: