30, డిసెంబర్ 2012, ఆదివారం

బుద్ధుని మధ్యమ సంభాషణలు

సంభాషణల్ని ఒక రచనా ప్రక్రియగా ఆరంభించినది ప్రపంచంలో బుద్ధుడేనేమో. ప్లేటో రాసిన 'డయలాగ్స్', నాగసేనుడు, మీనాండర్ మధ్య జరిగిన 'మిళిందపంహ' ఆ తరువాతివే. గతంలో బుద్ధుని దీర్ఘ సంభాషణల్ని తెలుగు చేసిన అన్నపరెడ్డి బుద్ధఘోషుడు ఇటీవల బుద్ధుని 'మజ్జిమ నికాయ'ను 'బుద్ధుని మధ్యమ సంభాషణలు'గా తెలుగు చేశారు. ఈ రకంగా పాళీ నుండి తెలుగు చేసిన వారిలో అన్నపరెడ్డిగారే మొదటి వారయ్యారు. బుద్ధుని సంభాషణల్ని ప్రత్యక్షంగా మనం వింటున్నట్లుగా సాగుతూ ఒక లిటరరీ బ్యూటీని అందించిన పుస్తకమిది. చదువుతున్నకొద్దీ వినబుద్ధి కలిగించే గుణం అనువాదంలో చోటు చేసుకుంది.

మానవుణ్ణి దుఃఖం నుండి విముక్తుణ్ణి చేయడానికి బుద్ధుడు చేసిన తాత్విక, తార్కిక సంభాషణల సంపుటే ఈ పుస్తకం. ఉదాహరణకు 'సర్వాసవ సూత్తం'లో అంటే అన్ని ఆసవాల (కాలుష్యాల) గురించిన సూత్రంలో ఎటువంటి మనిషిని కాలుష్యాలు అంటుతాయి? ఎవరిని అంటవు? వాటిని వదిలించుకోవడమెలా? అన్న అంశాల గురించి చర్చ ఉంది. జ్ఞానంతో కూడిన అవధానం (wise attention), అజ్ఞానంతో కూడిన అవధానం (unwise attentiong) అనే రెండింటితో మనిషి సంచరిస్తూ ఉంటాడని, ఒకడు అజ్ఞానంతో కూడిన అవధానంలో ఉన్నట్లయితే అతనిలో అంతకుముందే ఉన్న కాలుష్యాలకు మరికొన్ని చేరుతాయి అని చెప్పబడింది. ఈ కాలుష్యాల్ని చూడడం ద్వారా, భరించడం ద్వారా, పరిత్యజించడం ద్వారా, భావన చేయడం ద్వారా వదిలివేయాల్సి ఉంటుందని చెబుతాడు బుద్ధుడు. ఒక భిక్షు ఈ రకంగా చేసినపుడు అతడు 'సర్వాసవని గ్రహభిక్షు'గా మారతాడు. తృష్ణను, బంధనాలను తెంచుకుని, గర్వాన్ని అంతమొందించుకోవడంతో అతడు దుఃఖానికి అంతం పలుకుతాడు.

ఈ రకంగా కళంకాలు, శిక్షణ, క్షాళన ప్రక్రియ, సమ్యగ్దృష్టి, నిర్వాణ సాక్షాత్కారం, ధ్యానం, జ్ఞానోదయం వంటి యాభై అంశాల గురించి ఉపమానాలతో కూడిన కథల ద్వారా సాగిన సంభాషణలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. బుద్ధుని మధ్యమ సంభాషణలు బౌద్ధాభిమానులకే కాక, సత్యాన్వేషకులందరికీ అందుబాటులోకి రావడంలో అనువాదకుని కృషి ఎంతో గుర్తించదగింది.
- కాకుమాని శ్రీనివాసరావు

బుద్ధుని మధ్యమ సంభాషణలు,

అనువాదం : అన్నపరెడ్డి బుద్ధఘోషుడు
పేజీలు : 351, వెల : రూ. 200/-,
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు


బౌద్ధ టూరిజానికి బెస్ట్ గైడ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో చోట్ల ఒక నాటి బౌద్ధ వైభవాన్ని సూచించే చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయని తెలుసు. కాని ఎక్కడెక్కడున్నాయో చెప్పమంటే మాత్రం అమరావతి, నాగార్జున కొండ, మరో రెండు మూడు పేర్లు చెప్పి ఊరుకుంటాం. అంతకు మించి చెప్పలేం. 'ఆంధ్రదేశంలో బౌద్ధ వైభవం' పేరుతో ఒక పరిశోధన గ్రంథాన్ని రాశారు పిల్లి రాంబాబు. వేల ఏళ్లనాటి బౌద్ధ వైభవానికి నిలువెత్తు సాక్ష్యాలను, ప్రదేశాలను స్వయంగా సందర్శించి, ఆయా ప్రదేశాల గురించిన ఎంతో సమాచారాన్ని సేకరించి రాసిన పుస్తకమిది. కేవలం బౌద్ధం కోసమే కాకుండా మన రాష్ట్ర చరిత్రపై ఆసక్తి ఉన్నవాళ్లంతా చదవాల్సిన పుస్తకమిది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల మ్యాప్‌లు ఇచ్చి వాటిలో ఎక్కడెక్కడ బౌద్ధ క్షేత్రాలున్నాయో వివరిస్తూ ప్రచురించిన పుస్తకం బహుశా ఇదొక్కటేనేమో. జిల్లాలలోని ఏ మారుమూల గ్రామంలో ఏ బౌద్ధ క్షేత్రమున్నదో కూడా వివరించారు గ్రంథకర్త.

బౌద్ధం గురించిన పరిశోధనతో పాటు ఆ మత పరిచయం కూడా ఉంటుందీ గ్రంథంలో. రాష్ట్రంలోనే కాకుండా మన దేశం మొత్తంలో బౌద్ధ యుగం గురించి వివరిస్తూ, బౌద్ధ ధర్మ విశిష్టతను పేర్కొంటూ బౌద్ధానికి సాహిత్యం తోటి, కళలతోటి, భాషతోటి ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు. బౌద్ధ తాత్వికులను పరిచయం చేస్తూ బౌద్ధ ఉత్థాన పతనాలను పేర్కొంటూ ముగిస్తారు రాంబాబు. ఈ ఆల్ ఇన్ వన్ గైడ్‌లో భాష కూడా సరళంగా ఉంది. బౌద్ధం మీద విస్తృత పరిశోధనలు చేసిన అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ముందుమాటలో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధం గురించి సమగ్రంగా చర్చిస్తూ తెలుగులో వచ్చిన గ్రంథమిది.

ఆంధ్రదేశంలో బౌద్ధ వైభవం, పి. రాంబాబు
పేజీలు : 478, వెల : రూ. 300/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు

వినయ పిటకము
బౌద్ధ ధర్మానికి మూల గ్రంథాలు సుత్త పిటకము, వినయపిటకము, అభిదమ్మపిటకము. వీటినే త్రిపీటకాలు అని పిలుస్తారు. వాటిలో రెండోదైన వినయపిటకము బౌద్ధ భిక్షువులు పాటించాల్సిన నియమ నిబంధనలకు సంబంధించినది. మిగతా రెంటిలో ఏదీ సమగ్రంగా తెలుగులోకి అనువందింపబడలేదు. ఈ గ్రంథం ప్రధానంగా బౌద్ధ భిక్షువుల కోసం ఉద్దేశించినదే ఐనా ఆ కాలం నాటి ప్రజాతంత్ర వ్యవస్థ, వేషభాషలు, ఆహారపుటలవాట్లు, వైద్య విధానము లాంటి మరెన్నో విషయాల గురించి కూడా చాలా సమాచారాన్ని ఇస్తుందీ గ్రంథం. అనువాదం కాస్త పాత కాలపు భాషలో ఉంది కాబట్టి ఓపిగ్గా చదవగలిగినపుడు మాత్రమే ఆ భాషకి అలవాటు పడగలం.

ధమ్మపదం
బుద్ధుడు తాను నమ్మిన ధర్మాన్ని ప్రబోధిస్తూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరికి బోధించిన విషయాలే ఈ ధమ్మపదం. సుత్త పిటకంలో ఒక భాగమిది. 26 'వర్గాలు'గా విభజించిన ధమ్మపదంలో మొత్తం 423 శ్లోకాలు, వాటి తాత్పర్యాలూ ఉన్నాయి. బుద్ధుడు తన జీవితంలో బోధించిన విషయాల సంక్షిప్త రూపమే ఈ పుస్తకం.
వినయపిటకము, పేజీలు : 530, వెల : రూ. 300/-
ధమ్మపదం,
పేజీలు : 82, వెల : రూ. 30/-,
అనువాదం : మోక్షానందస్వామి,
ప్రతులకు : మోక్షానందాశ్రమము, తిమ్మాపూర్,
నిజామాబాద్ జిల్లా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి