18, జనవరి 2013, శుక్రవారం

పరిపూర్ణత


హిందూ మతంలోని పరిపూర్ణతే బౌద్ధం

సంస్కృతి

అమెరికాలోని చికాగో నగరంలో 1893, సెప్టెంబర్‌ నెలలో నిర్వహించిన సర్వమత మహాసభలకు భారతదేశం తరఫున స్వామీ వివేకానంద హాజరయ్యారు. ఆ సందర్భంగా సెప్టెంబర్‌ 26వ తేదీనాడు బుద్ధుని గురించి, బౌద్ధ మతం గురించి చేసిన ఆ ప్రసంగాన్ని ఒకింత మననం చేసుకుందాం...
నేను మీరు విన్నట్లుగా బౌద్ధుడను కాకున్నా బౌద్ధుడనే. చైనా, జపాన్‌, సిలోన్‌ దేశాలుబుద్ధుని బోధలు అనుసరించుచున్నచో, భారతదేశం ఆయన్ను సాక్షాత్తూ అవతారమూర్తిగా పూజిస్తుంది. నేను బౌద్ధ మతాన్ని విమర్శించబోతున్నానని మీరిప్పుడు విన్నారు, కాని దానివలన మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. సాక్షాదవతారమూర్తియని నేను పూజించే ఆ మహనీయుని భావాలను విమర్శించడమా! బుద్ధదేవుని శిష్యులు ఆయన తత్త్వాన్ని సరిగా అవగాహన చేసికొనలేకపోయారని నా అభిప్రాయం. యూదుమతానికి (జుడాయిసమ్‌) క్రైస్తవ మతానికి ఎలాంటి సంబంధముందో, హిందూమతానికి (హిందూమత మనగా -వైదిక ధర్మమని, సనాతన ధర్మమని నా అభిప్రాయం), బౌద్ధమతానికి ఇప్పుడు అటువంటి సంబంధమే ఉంది.
ఏసుక్రీస్తు యూదుడు. శాక్యముని హిందువు. యూదులు ఏసుక్రీస్తును తిరస్కరించడమే గాక, సిలువ వేశారు; కాని ఆధునిక బౌద్ధమతానికీ, బుద్ధదేవుని బోధనలు మనంగ్రహించవలసిన తత్త్వాలను నిజమైన భేదం హిందువులుగా మేము ముఖ్యంగా చూపెట్టబోయేది ఇది. శాక్యముని కొత్తగా ఏదో బోధించడానికి రాలేదు. అతడు ఏసువలె (మత ధర్మాలను) పరిపూర్ణం చేయడానికేగాని నశింపచేయడానికి రాలేదు. కాని వ్యత్యాసమిది.
ఏసు విషయంలో, ఆయన బోధలను గ్రహింపలేక పోయినవారు ప్రాచీనులైన యూదులు; బుద్ధుని విషయంలో, ఆయన బోధను గ్రహింపలేకపోయినవారు స్వయంగా ఆయన అనుయాయులే. పాత నిబంధన (ఓల్డ్‌ టెస్ట్‌మెంటు) సాఫల్యాన్ని యూదులు గ్రహించినట్లే, హిందూతత్త్వపు సాఫల్యాన్ని
బౌద్ధులు గ్రహింపలేదు. శాక్యముని ఏ మత ధర్మాలనూ నాశనం చేయడానికి జన్మింపలేదని హిందూ మత తత్త్వాలకు సహేతుకంగా పరిపూర్తిని, సహేతుక పరిణతిని కలిగించడానికి జన్మించాడని మరల నేను నొక్కివక్కాణిస్తున్నాను.
హిందువుల ధర్మం కర్మకాండ, జ్ఞానకాండలనే రెండు భాగాలుగా విభజింపబడివుంది. జ్ఞానకాండను ముఖ్యంగా సన్న్యాసులు అనుసరిస్తారు. జ్ఞానకాండ విషయంలో జాతిభెెద మనేది-వర్ణభేద మనేదిలేదు. అగ్రవర్ణానికి చెందినవాడు, తక్కువ వర్ణానికి చెందినవాడు కూడా సన్యాసి కావచ్చు. అపుడా రెండు వర్ణాలు సమానాలవుతాయి. మత విషయంలో వర్ణవ్యవస్థ అనేది లేనేలేదు. వర్ణ వ్యవస్థ కేవలం ఒక సాంఘిక కట్టుబాటే.
అందరియందూ ముఖ్యంగా అజ్ఞానులు పేదలయందు ఆ దయామయుడు చూపెట్టిన అద్భుత సానుభూతిలో అతని మహత్వమంతా ఇమిడివుంది. అతని శిష్యులలో కొందరు బ్రాహ్మణులు. బుద్ధుడు ధర్మ ప్రచారంచేసే సమయంలో సంస్కృతం వ్యావహారిక భాష కాదు. బుద్ధుని బ్రాహ్మణ శిష్యులు కొందరు ఆతని బోధనలు సంస్కృతంలోకి అనువందించడానికి ప్రయత్నిస్తే, వారికి ఆతడిలా స్పష్టంగా చెప్పాడు. 'పేదలకు, జనసామాన్యులకు తోడ్పడడమే నా ఆశయం. ప్రజల మాతృభాషలోనే నన్ను మాట్లాడనివ్వండి.' కనుక ఇప్పటివరకు ఆతని బోధనలలో ఎక్కువ భాగం అప్పటి వాడుక భాషలోనే ఉంది.
తత్త్వశాస్త్రం ఏది చెప్పినా, వేదాంతమేది స్థిర పరిచినా, మరణమనేది ఉన్నంతవరకు, మానవ హృదయంలో దౌర్బల్య మున్నంత వరకు, బలహీనావస్థయందున్న మానవ హృదయం నుండి (రక్షణార్థం) ఆర్తనాదం వెలువడుచున్నంత వరకు -భగవంతునిపై నమ్మకం అనేది ఉండి తీరుతుంది.
తాత్త్విక విషయంలో బుద్ధదేవుని శిష్యులు వేదాలనే సుస్థిర పర్వతాలను ఢీకొని, వాటిని కదలింప లేకపోవడంతో - స్త్రీ, పురుషుడు, ప్రతివ్యక్తీ ఎంతో ఆశతో ఆశ్రయించుకొని ఉన్న శాశ్వతుడైన భగవంతుణ్ణి సమాజం నుండి తొలగించారు. ఫలితంగా బౌద్ధమతం హిందూదేశంలో తనకు తానే అంతరించింది. బౌద్ధమత జన్మస్థానమైన భారతదేశంలో ఇప్పుడు బౌద్ధుడనిపించుకునేవాడు ఒక్కడూ లేడు. కాని బ్రాహ్మణ మతానికి కొంత నష్టం వాటిల్లింది. గ్రీసుదేశీయ చరిత్రకారునిచే హిందువు అసత్యాలు చెప్పడం కాని, హైందవ స్త్రీ వ్యభిచారిణియై ఉండడం కాని కనీ వినీ ఎరుగననిపించుకొనేటంతటి ఘనత హైందవ సమాజానికి చేకూర్చి, జనులలో బౌద్ధమతం వెల్గొందించిన ఆ అద్భుత పరివర్తనా ప్రభావం- ఇవన్నీ బ్రాహ్మణ మతం కోల్పోయింది.
హిందూమతం లేనిదే బౌద్ధమతం -బౌద్ధమతం లేనిదే హిందూమతం జీవించి ఉండలేవు. కనుక ఆ గురువరేణ్యుని (బుద్ధుని) ఔదార్యంతో, అద్భుతమగు లోకహితాచరణను ప్రేరేపించే శక్తి సామర్థ్యాలతో బ్రాహ్మణుని అఖండ బుద్ధి కుశలతని మేళవిద్దాం గాక!
                                                                     ----స్వామి వివేకానంద

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి