18, జనవరి 2013, శుక్రవారం

మహితాత్ముడు


                    బుద్ధుడు మహితాత్ముడు 

 

ఈ విశాల విశ్వంలో  మానవ మనుగడకు మార్గదర్శకుడైన మహానుభావుడు బుద్ధుడు. కాల్పనిక, పౌరాణిక, వ్యక్తిగా కాకుండా వివక్తమైన మనుష మూర్తిగానే తత్వాన్ని ప్రబోధించి మనలో చైతన్యాన్ని పెంచేందుకు పాటుపడ్డ మహితాత్ముడు బుద్ధుడు.
భూమి పుట్టిన తర్వాత చరిత్రలో బుద్ధుడంతటి మహామహుడు జన్మించలేదంటే అతిశయోక్తి లేదు. అందుకు కృతజ్ఞతా పూర్వకంగానే నేమో! ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు తథాగతుణ్ని స్మరిస్తూ బుద్ధపౌర్ణమి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడు తున్నాయి.
వైశాఖ పౌర్ణమి విశిష్టత
ఇప్పటికి 2574 సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం 563వ సంవత్స రంలో వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధునిగా ప్రసిద్ధుడైన గౌతముని జననం జరిగింది. అలాగే, గౌతమునికి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజునే గయలోని బోధి వృక్షం క్రింద జ్ఞానోదయమైనట్లు, పంచవర్గ భిక్షకులకు బుద్ధుడు ప్రథమ సందేశమిచ్చినట్లు చరిత్ర. చాలా చిత్రంగా ఆయన తన 80వ ఏట వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజునే నిర్యాణం చెందారు.
ఈ విధంగా వైశాఖ పౌర్ణమి బుద్ధుని జీవితంలో అనేక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. కాబట్టే ఇది అందరికీ అతి పవిత్రమైన దినంగా మారిపోయింది.
గౌతముని బాల్యం
బుద్ధునిగా వినతికెక్కిన తథాగతుని అసలు పేరు సిద్దార్థుడు. కపిల వస్తు పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తున్న శాక్యవంశపు రాజైన శుద్దోధనుడు, రాణి మాయాదేవిల పుత్రుడే సిద్దార్థుడు. చిన్నతనం లోనే తన తల్లి రాణి మహామాయదేవి మరణించడంతో సిద్ధార్ధుడు తన పిన తల్లి ప్రజాపతి గౌతమి వద్ద పెరిగాడు. సిద్ధార్థుణ్ని అందరూ ఆ నాటి నుండే గౌతముడిగా పిలవడం ప్రారంభించారు. చిన
చిన్నతనంలోనే అతను సమస్త విద్యలను అభ్యసించాడు. 19వ ఏట యువరాణి యశోధరతో గౌతమునికి వివాహం జరిగింది. యశోధరతో దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తూ రాహుల్‌కి జన్మనిచ్చిన అనంతరం ప్రాపంచిక సౌఖ్యాలపై విరక్తి చెందిన గౌతముడు భార్యబిడ్డలను, రాజ్యాన్ని వదిలి అడవీ భూములకు వెళ్లాడు.
బుద్ధుడుగా మారిన వైనం
ప్రపంచమంతా దుఖమయమని, దీని నుండి విముక్తి పొందడానికి మార్గాన్ని అన్వేషించాలని నిశ్చయించుకున్న గౌతముడు రాజ్యాన్ని, భోగ భాగ్యాలను త్యజించాడు. భార్యబిడ్డలను సైతం వదిలి సత్యాన్వేషణకై వివిధ ప్రాంతాలను సందర్శించాడు. ఇందుకోసం అడవులలో తపస్సు చేసినప్పటికీ గౌతముడికి ఆశించిన ఫలితం కనిపించలేదు.
తాను అనుకున్న లక్ష్యం నెరవేరక పోవడంతో దానికోసం తిరుగుతూ తిరుగుతూ చివరకు గయవద్ద ఒక రావిచెట్టు కింద ధ్యానముద్రలో కూర్చున్నాడు. అప్పుడే ఆ మహానుభావునికి జ్ఞానోదయం కలిగింది. నాటి నుండి సిద్దార్థుడు గౌతమ బుద్ధుడిగా మారాడు. కమలం, కలువ పువ్వులు నీటిలో జన్మించినప్పటికి ఆ నీటిని తాకకుండా, అందులోని బురద అంటకుండా ఉన్నట్లే మనుష్యు నిగానే జన్మించిన గౌతముడు సహజమైన మానుష్య లక్షణాలను అలవర్చుకోకుండా, మానవ జీవితంలోని మాయ తొలగించే మార్గాన్ని శోధించేందుకు యత్నిస్తుండే వాడు. ప్రపం చానికి అంటిపెట్టు కోకుండా జీవించాడు. కాబట్టే మనిషిలో వుండే బలహీనతలను జయించి, ఆది మహాను భావునిగా ప్రసిద్ధు డయ్యాడు. రాగ ద్వేష, లోభాది ఆనవాళ్ల ను జయించి గౌతముడు బుద్ధుడయ్యాడు.
మానవులలో ఉత్తముడిగా...
బుద్ధున్ని హిందువులు విష్ణు అవతారాలలో ఒకటిగా భావించినా, బుద్ధుడు మాత్రం తాను దేవుణ్ని కాదని, మానవుడినేనని చెబుతుండే వాడు.
దైవాన్నంగీకరించక, వేదాలను ధిక్కరిస్తూ ఆత్మలేదని బుద్ధుడు ప్రకటిస్తుండేవాడు. అహింస, మైత్రి, కరుణలను ప్రోత్సహిస్తూ కర్మకాండలు, జంతుబ లులను నిరసించాడు.
విశ్వంలోని ఏ ఇతర మత ప్రవక్తలకైనా తమ ఉన్నత స్థితికి బాహ్య ప్రపంచం నుండి, గురువుల నుండి ప్రేరణ లభించింది. కానీ బుద్ధునికి మాత్రం బాహ్యాధారం లేకుండానే తనలోనుండే ప్రేరణలభించింది. కాబట్టే ఆయన్ను స్వయం భూ అనేవారు. అందుకనే బుద్ధుడు దేవుడిగా కాకుం డా మానవుల్లో ఉత్తము డిగా నిలి చాడు. సరళ తనం, నిజాయితీ, ఏకాంత జీవి లక్షణాలు బుద్ధుని జీవితంలో అగుపిస్తుంటాయి.
బుద్ధుని బోధనలు...
బుద్ధుడు ఏ విషయాన్నైనా మాటల పరంగాకాని, బుద్ధి రూపంలోకాని చెప్పి సంతృప్తి చెందలేదు. తాను అనుభవంలోకి తెచ్చుకున్న విషయాన్ని మాత్రమే ప్రజలకు చెప్పేవాడు. అలాటి వాటితోనే ప్రజలకు మేలైన ఉపయోగ ముంటుందని అంటుండేవాడు. మనకే ఉపయుక్తం కానిది మరొ కరికెలా ఉపయోగపడు తుందనేది ఆయన వాదన. అనిత్యవస్తువులను నిత్యాలుగా చూడడం, లేని ఆత్మను ఉన్నట్లు భావించడం, సర్వస్వం దు:ఖ మయమని తెలుసుకోలేక పోవడంవల్ల జీవితంలో అసంతృప్తి, దు:ఖం మిగులుతుందని ఆయన స్పష్టం చేస్తుండేవారు.
ధ్యాన మార్గాన్ని అనుసరిస్తే సరైన దృష్టి ఏర్పడి ప్రపంచాన్ని అనిత్యంగా, చూస్తూ జ్ఞానోదయం కలుగుతుందని బుద్ధుడు వివరించాడు. కార్యకారణ సిద్ధాంతాన్ని శాస్త్రీయ ప్రాతిపదికపై విశ్లేషించాడు. మానవుల్లో తృష్ణ వల్లే దు:ఖం పుడుతుందని దాన్ని నిరోధించాలని ప్రబోధించాడు.
బుద్ధుడు ప్రతిపాదించిన ప్రాతిత్య సమూత్పాద సిద్ధాంతంనుండే ఆర్యసూత్రాలు జనించినవి. బుద్ధుడు నాలుగు ఆర్యసూత్రాలను ప్రతిపాదిం చాడు. అవే...
దు:ఖం, దు:ఖానికి కారణం కోరికలు, వాటిని జయించడంద్వారా దు:ఖాన్ని నివారించవచ్చు. దీని నివారణకు అష్టాంగ సూత్రాలు మార్గ నిర్దేశం
అష్టాంగ సూత్రలేమిటంటే.... సమ్యక్‌ దృష్టి (ఉత్తమ ఆదర్శాలు), సమ్యక్‌ సంకల్ప (ఉత్తమ సంకల్పం), సమ్యక్‌ వాక్‌ (ఉత్తమ వాక్యాలు), సమ్యక్‌ వ్యాయమ (ఉత్తమ సాధన), సమ్యక్‌ స్మృతి (ఉత్తమ స్మరణ), సమ్యక్‌ సమాధి (ఉత్తమ ధ్యానం) అనే అష్టసూత్రాలను ఆచరించడం ద్వారా మానవులు తమ కోరికలు, స్వార్థమనే పర్వతాలనుండి విముక్తి పొంది తద్వారా మోక్షం పొందుతారని బుద్ధుడు ప్రబోధించాడు.
బౌద్ధమత విస్తరణ: అప్పుడు బుద్ధుడు ప్రవచించిన మతమే బౌద్ధ మతంగా స్థిరపడింది. ఆయన శిష్యలు, అనుచరులనే బౌద్ధులని, భిక్షువులని పిలుస్తారు. వారణాసి వద్ద సారనాథ్‌లో బుద్ధుడు తొలిసారిగా పంచవర్గ బిక్షువులకు ఉపదేశమిచ్చాడు. బుద్ధుని శిష్యులలో ఉపతిప్ప, అస్సాజీలు ముఖ్యులుగా వుండేవారు. తదుపరి అనేకమంది చక్రవర్తులు బౌద్ధమతాన్ని స్వీకరించి, బౌద్ధమత ప్రచారానికి కృషి చేశారు.
మనదేశంలో పుట్టిన బౌద్ధమతం కాల క్రమేణ ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. మగధరాజు అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించి తన రాజ్యంలో మూడవ బౌద్ధమత సభను నిర్వహించాడు. అంతేకాదు! మత వ్యాప్తికై విదేశాలకు తన కుమారుడైన మతం ఇవ్వలేని స్వేచ్ఛను బౌద్ధమతం ఇచ్చింది. ఇది ఓ ధర్మంగా, ఓ జీవన విధానంగా ప్రసిద్ధికెక్కింది. బౌద్ధం తత్త్వ శాస్త్రాన్ని బోధించింది. అందుకే బౌద్ధమతం మనదేశంలోనే కాకుండా చైనా, టిబెట్‌, హాంకాంగ్‌, జపాన్‌, సుమిత్ర తదితర ఆగ్నేయ ఆసియా దేశాలలో సైతం విస్తరించింది.
మన రాష్ట్రంలో నాగార్జున కొండ, అమరావతి, పట్టణాలు ముఖ్య బౌద్ధ ఆరామాలుగా వెలుగొందాయి. దేశంలో లుంబిని, గయా, సాంచి, సారనాథ్‌, లాంటి క్షేత్రాలలో బౌద్ధ స్తూపాలు, విహారాలు చైతన్యాలు నెలకొల్ప బడ్డాయి. భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ మూడు లక్షల మంది అనుచరులతో బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అంతే కాదు! ఆయన పంచశీల సిద్ధాంతాల్ని రూపొందిన ప్రవక్త కూడా.
ఆయన బోధనలను ఆచరిస్తేనే దేశంలో శాంతి సుభిక్షంగా ఉంటుంది.

1 కామెంట్‌: