18, జనవరి 2013, శుక్రవారం

బౌద్ధం కోసం..

ఈ దేశంలో మళ్లీ బౌద్ధం కోసం... 

 

ఆమె పేరు వాంగ్మో డిక్సీ. అమెరికాలో పుట్టి, అమెరికాలో చదివిన వాంగ్మో డిక్సీ బుద్ధుడు పుట్టిన భారత దేశంలోనే బౌద్ధమతాన్ని వ్యాప్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. గత 9 సంవత్సరాలుగా ఆమె భారత దేశంలో ఈ దిశన చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. బుద్ధగయ, సారనాథ్, నలందా, శ్రావస్తి, రాజగిరి, వైశాలి, కుశీనగర్, లుంబిని వంటి బుద్ధుడు నడిచిన ప్రదేశాల్లో తిరుగుతూ ఆ ప్రదేశాల్లో గత వైభవాన్ని పునర్నిర్మించేందుకు, మరుగున పడిన ప్రాచీన బౌద్ధ తాళపత్రాలను పరిరక్షించేందుకు, బౌద్ధమతంపై పరిశోధనను ప్రోత్సహించేందుకు ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బౌద్ధమతం భారతదేశంలోనే పుట్టినందువల్ల ఏదో ఒక సమయంలో బౌద్ధం తిరిగి భారతదేశమంతటా వ్యాపిస్తుందని, జనాన్ని చైతన్యపరుస్తుందని ఆమె ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఈ విలేఖరి కలిసినప్పుడు ఆమె అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.

మా నాన్న తార్తంగ్ తుల్కు టిబెట్‌కు చెందిన బౌద్ధగురువు (లామా). 1959కి ముందు టిబెట్‌లో బౌద్ధధర్మాన్ని శాస్త్రీయంగా అభ్యసించిన చివరి లామాల్లో ఆయనొకరు. 1961లో వారణాసిలో ఆయన బౌద్ధ ప్రచురణల సంస్థను స్థాపించారు. ప్రముఖ బౌద్ధ గురువు, కవి మిలోరెపా పై సినిమా తీసేందుకు వచ్చిన ఫ్రెంచి కవయిత్రి నాజ్లీ నౌర్ మా నాన్న తార్తంగ్ తుల్కుతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ అమెరికాలోని బర్కిలీకి పారిపోయారు. అక్కడ ఆయన బౌద్ధధర్మ పరిరక్షణకు పలు సంస్థల్ని స్థాపించారు. తన ముగ్గురు కూతుర్లను మూడు ప్రాంతాలకు బౌద్ధమతాన్ని విస్తరింపచేసేందుకు పంపారు. నేను పెద్దదాన్ని. భారతదేశంలో పనిచేయాలని నేను వచ్చాను. భారతదేశం అంటే మా నాన్నకు ఎంతో ప్రేమ. మహారచయిత రాహుల్ సాంకృత్యాయన్ పేరును ఆయన కలవరిస్తుంటారు.

మీ కార్యక్రమాలు ఏమిటి? భారతదేశంలో బౌద్ధమతం వేళ్లూనుకుని ఉన్నది. మేం చేయవలిసిందల్లా దాని ఆత్మను రగిలించడమే. అందుకు కావల్సిన ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ ఇప్పటికీ ఉంది. ఈ వాతావరణాన్ని విస్తరించడం, చైతన్యం కలిగించడం, బౌద్ధ గురువులనంతా సమీకరించి బుద్ధుడి బోధనలను వ్యాప్తి చేయడం, చరిత్ర అట్టడుగుపొరల్లో ఉన్న బౌద్ధ మత గ్రంథాలను, తాళపత్రాలను వెలికి తీయడం, పాలి భాషకు పూర్వ వైభవం కల్పించడం పై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. అనేక సంస్థల్ని స్థాపించాం. ఏటా డిసెంబర్‌లో బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన బౌద్ధగయకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది బౌద్ధ సన్యాసులను రప్పించి పది రోజుల పాటు బౌద్ధమత, ప్రవచనాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. బంగ్లాదేశ్, లావోస్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం మొదలైన దేశాల బుద్ధ సన్యాసులు బౌద్ధగయకు వచ్చి తమ భారతీయ సహచరులతో కలిసి బోధి వృక్షం క్రింద సమావేశమై పాలి భాషలో బుద్ధుడి బోధనలను మననం చేసుకుంటున్నారు. బుద్ధుడి బోధనలు, విశ్లేషణలు, బౌద్ధమత నియమనిబంధనలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి.

ఇవి కాక బుద్ధుడు నడిచిన ప్రధాన క్షేత్రాలను పునరుద్ధరించడం, వసతులు కల్పించడం, ప్రపంచ శాంతి ఘంటికలను నెలకొల్పడం వంటివి చేస్తుంటాను. ఇది ఎనిమిదో సంవత్సరం. బుద్ధగయలో బోధి వృక్షానికి తూర్పున క్రీ.పూ 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించిన 170 అడుగుల ఎత్తైన సమున్నతమైన మహాబోధి మహావిహారకు మరమ్మతులు చేయగలగడం మాకు లభించిన ఒక గౌరవం. పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెత్తను ఏరివేసేందుకు నగర పంచాయితితో ఒప్పందం చేసుకున్నాం. బౌద్ధసన్యాసులు ధ్యానం చేసే కాలచక్ర మైదానం వద్ద సౌకర్యాలు కల్పించాం. సారనాథ్‌లో ఒక అంతర్జాతీయ పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసి అక్కడ బౌద్ధ సన్యాసులకు శిక్షణ, పాలి భాషలో అధ్యయనం, పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఒకసారి బౌద్ధం ప్రాధాన్యతను తెలిపే కార్యక్రమాలను సుస్థిరం చేస్తే భారత దేశమంతటా బౌద్ధం వ్యాప్తి చెందుతుందని మా ఆశ. భారతదేశంలో బౌద్ధం గురించి చెప్పగలిగే అ«ధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. హిందీ, ఇతర స్థానిక భాషల్లో కూడా బౌద్ధ మత గ్రంథాలను ప్రచురించే పని ప్రారంభించాం. భారతదేశంలో బౌద్ధం గురించి ఆసక్తి నిజానికి రోజురోజుకూ పెరుగుతోంది. కాని ఆ ఆసక్తిని తీర్చే సాధనాలు మాత్రం లేవు.

మతం మళ్లీ వేళ్లూనుకునే అవకాశం ఉందా? అవినీతి, రాజకీయ వ్యవస్థ గురించి నేనూ వింటూనే ఉన్నాను. ప్రపంచం మారుతుంటుంది. మీరనుకుంటున్న చెడు కూడా ఈ వ్యవస్థనుంచి తొలగిపోతుంది. మనం అందుకు నిరంతరం ప్రయత్నిస్తుండాలి. నలందా విశ్వవిద్యాలయం వంటి అత్యున్నత బౌద్ధ విద్యాలయాలు మధ్యయుగాలకు ముందు ఇక్కడ విలసిల్లాయి. గత 7శతాబ్దాల్లో బౌద్ధం క్షీణించినంత మాత్రాన దానికి ఇక్కడ ప్రాధాన్యత లేదనడం సరైంది కాదు. రోజురోజుకూ పెద్ద సంఖ్యలో బౌద్ధమతానికి మారిపోతున్నవారిని నేను కళ్లారా చూస్తున్నాను. నిజానికి బౌద్ధం ఒక మతం కాదు. అదొక తాత్విక, సామాజిక దృక్పథం. ఇప్పటికీ భారత దేశాన్ని అంతర్జాతీయ ప్రపంచంలో చాలా మంది గౌరవించడానికి కారణం బౌద్ధం ఇక్కడ జన్మించడమే. అహింస, పరమత సహనం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మనుషుల మధ్య అన్ని రకాల అడ్డుగోడలు లేకుండా చేయడం, ఇవన్నీ మౌలికంగా బౌద్ధం నుంచి ఆవిర్భవించిన మానవీయ విలువలే. ఆశ్చర్యకరమైనదేమంటే, ఒక బృహత్తరమైన, చారిత్రక, సామాజిక పాత్ర నిర్వహించిన బౌద్ధం ఇక్కడ తాత్కాలికంగానైనా అదృశ్యం కావడం.

మీ భర్త మీకు సహకరిస్తారా? నా భర్త రిచర్డ్ డిక్సీ నాకంటే ఎక్కువగా బౌద్ధం అంటే పడిచస్తాడు. నాకంటే ఎంతో ముందు ఒక బ్యాగు తగిలించుకుని ఇండియా అంతా తిరిగాడు. ఒక సెమినార్‌లో ఒక బౌద్ధమత గురువును ప్రశ్నలతో వేధిస్తుంటే చూశాను. వెంటనే నచ్చేశాడు. నా పనిలో ఎంతో సహకరిస్తున్నాడు. అయితే ఆయన ఎక్కువగా పిల్లలను చూసుకుంటాడు. లేకపోతే నేను తిరగలేను కదా..

బుద్ధుడి బోధనలు ఇప్పటి తరానికి బోధించేదేమిటి? బుద్ధుడి బోధనల్లో అత్యంత ముఖ్యమైనది మాధ్యమిక. అంటే మధ్యే మార్గం. వేల కోట్ల భౌతిక సంపదను ఆర్జించి ప్రపంచాన్ని జయించలేం. అదే విధంగా అన్నిటినీ త్యజించి కూడా జీవించలేం. కాబట్టి మధ్యేమార్గం అవలంబించడమే సరైన మార్గం. దీన్నే 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు బోధించాడు. బౌద్ధం మన జీవితాలను ప్రక్షాళనం చేసి మనను సరైన మార్గంలోకి తీసుకువెళుతుంది. భౌతిక వస్తువులే ప్రధానమనుకునేవారు కొందరయితే, భావోద్వేగాలు, విశ్వాసాలు ప్రధానమనుకునేవారు మరికొందరు. మన జీవితం ఇలాగే జీవించాలని ఏ దైవం నిర్ణయించడు. అదే సమయంలో ఇష్టం వచ్చినట్లు అనైతికంగా, సరైన ప్రవర్తన లేకుండా జీవించాలని కాదు. మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులను స్పష్టంగా అర్థం చేసుకోవడంపైనే నైతికత ఆధారపడి ఉంటుంది.

ప్రతీది అసా«ధారణ శక్తులు నిర్ణయిస్తాయని కొందరు, అంతా భౌతిక సంపదపైనే ఆధారపడి ఉన్నదని మరికొందరు భావిస్తారు. కాని బౌద్ధం విభిన్న పరిస్థితులు, భావాలు, ఆలోచనల మధ్య మధ్యేమార్గాన్ని సృజించింది. అది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కూడా దారిని చూపింది. అశాశ్వత వస్తువుల్లో ఆత్మ ఉండదు. వాటిపై ఆధారపడడం బాధను తప్ప మరేదీ కలిగించదు. బుద్ధుడి బోధనలు స్పష్టంగా, సరళంగా ఉంటాయి. వాటిని అన్వయిస్తే మన జీవితం, సమాజం నిత్యనూతనంగా, నిత్య సుసంపన్నంగా ఉంటుంది.

అదొక శాస్త్రీయ భౌతిక వాదం. మతపరమైన నమ్మకాలు, మూఢనమ్మకాలతో కూడిన ప్రాపంచిక దృక్పథం నుంచి బౌద్ధం మనకు విముక్తి కలిగిస్తుంది. భౌతికవాద సంస్క­ృతిలో బౌద్ధమే ఒక విశిష్టమైన దారిని, మనకు సరిపడే దారిని చూపిస్తుంది. మనను పరాయాకరణ నుంచి దూరం చేస్తుంది. ఆధునిక ప్రపంచంలోని ఆ«ధ్యాత్మిక జీవితంలోకి మనం ప్రవేశించేలా చేస్తుంది. అనుభవాలను సరైన విధంగా అహగాహన చేసుకోవడానికి వీలుకల్పించడం ద్వారా బౌద్ధం మనను ప్రక్షాళన చేస్తుంది. ఎంత సాధించినా అసంతృప్తి వీడని భావనలనుంచే స్వేచ్ఛ ఏర్పడుతుంది. అది కొంతకాలం పాటు ఉన్నా సరే ఆధ్యాత్మిక జీవనం విజయం సాధించినట్లే. 
(ఎ.కృష్ణారావు ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి గారికి ధన్యవాదాలు )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి