18, జనవరి 2013, శుక్రవారం

బాధలకు కోరికలే కారణం

బాధలకు కోరికలే కారణం: బుద్ధుడు

 

గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. లుంబిని అనే చోట జన్మించిన సిద్ధార్థుడు కపిలవస్తు నగరంలో పెరిగాడు. ఇతని తండ్రి శుద్ధోధనుడు అనే రాజు. తల్లి మాయాదేవి. భార్య పేరు యశోధర. పుత్రుని పేరు రాహులుడు. సిద్ధార్థుడు పుట్టిన వెంటనే జోతిశ్శాస్త్రవేత్తలు- ''ఇతడు భవిష్యత్తులో గొప్ప చక్రవర్తిగానీ సర్వసంగ పరిత్యాగి కానీ అవుతాడని చెప్పారు. తండ్రి శుద్ధోధనుడు తన కుమారుడు చక్రవర్తి అవుతాడన్నందుకు సంతోషించాడు కానీ సర్వసంగ పరిత్యాగి అవుతాడని చెప్పడంతో ఖిన్నుడయ్యాడు. దైవ నిర్ణయం ప్రకారం చక్రవర్తి అయితే మంచిదని ఆశపడ్డాడు. సర్వసంగ పరిత్యాగి కాకూడదని, అలా జరగనివ్వకూడదని తలచాడు. అందుకే సిద్ధార్థుడికి బయటి ప్రపంచం తెలియకుండా రాజప్రసాదంలోనే సకల విద్యలూ చెప్పించాడు. సకల భోగాలూ కల్పించాడు. యుక్త వయస్సు రాగానే గుణవతి, సౌందర్యవతి అయిన యశోధరతో వివాహం జరిపించాడు. సిద్ధార్థుడు రాజప్రసాదంలోనే ఇతర ప్రాంతాలనే కాక తమ చుట్టుపక్కల ప్రదేశాలను కూడా చూడకుండా గడుపుతున్నాడు. సిద్ధార్థునికి చిన్నతనం నుంచి భూతదయ ఎక్కువ. ఏ ప్రాణులూ బాధపడడం ఆతడు భరించలేకపోయేవాడు. అలా కొన్నాళ్లు గడిచాక అతనికి 29 ఏళ్ల ప్రాయంలో నగరంలోకి సంచారం నిమిత్తం వెళ్లాడు. అపుడు యాదృచ్ఛికంగా ప్రజలు అనుభవిస్తున్న దారిద్య్రంతోపాటు ఒక వృద్ధుడు, ఒక శవం, ఒక సాధువు అతని కంటబడ్డారు. సిద్ధార్థుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. దారిద్య్రం ఎందుకు వస్తుంది? శరీరం ముడుతలు ఎందుకు పడుతుంది? శరీరం అచేతనంగా ఎందుకు మారిపోతుంది? మనిషి అన్నింటినీ ఒదిలివేసి సన్న్యాసిగా ఎందుకు అవుతాడు? ఇలా ఈ నాలుగు అంశాల మీద తర్జనభర్జనలు పడ్డాడు. ఫలితంగా తాత్త్విక చింతన వైపు సిద్ధార్థుని మనసు మరలిపోతుంది. అప్పటికి కుమారుడు రాహులుడు పుట్టి ఉంటాడు. కేవలం నెలల వయస్సే. సిద్ధార్థుని మనసు క్రమంగా మార్పు చెందుతూ వస్తోంది. తాను చూచిన నాలుగు దృశ్యాల తాలూకు మర్మాలను తెలుసుకోవాలనే తపన పెరిగిపోతూ ఉంటుంది. ఒక రాత్రి వేళ సమస్త రాజభోగాలను త్యజించి, తల్లిదండ్రులను, భార్యను, పుత్రుడినీ కాదనుకుని సత్యాన్వేషణకు కట్టుబట్టలతో బయలుదేరాడు. కొంత కాలం కఠోర దీక్ష చేశాడు. యోగ కొంతకాలం చేశాడు. అయితే శరీరాన్ని మనసునీ కష్టపెట్టడం నిరర్థకమని గ్రహిాంచాడు. ధ్యానసాధన ద్వారా తత్త్వాన్ని తెలుసుకోవచ్చునని భావించి ధ్యానానికి సిద్ధమయ్యాడు. ఇంతకాలమూ అనేక ఊళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక నాటికి ఒక గ్రామంలో భిక్ష స్వీకరించి, బోధగయలో రావిచెట్టు కింద ధ్యానమగ్నుడయ్యాడు. అలా నలభైతొమ్మిది రోజులు ధ్యానం చేసిన తర్వాత అతనికి జ్ఞానోదయం అయింది. లోకంలోని సమస్త కష్టాలకు, బాధలకు, రుగ్మతలకు కారణం తెలుసుకున్నాడు. అప్పటినుంచి సిద్ధార్థుడు బుద్ధు డయ్యాడు. ఆ రావి చెట్టు బోధి వృక్షమయింది. బుద్ధుడు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రజలకు చెప్పసాగాడు. అదే బౌద్ధం. దీనిని సనాతన బౌద్ధం అంటారు. అప్పటికి అది మతంగా రూపొందలేదు. ఆ తర్వాత అనేక విధాలుగా బౌద్ధం పరిణతి చెందుతూ వచ్చింది. అసలు బౌద్ధం, (బుద్ధుడు బోధించింది) సనాతన బౌద్ధం, బౌద్ధ సిద్ధాంత ఆరంభ దశ , నికాయ బౌద్ధం, మహాయాన బౌద్ధం, ప్రారంభ దశ, పరిణతి దశ వజ్రయానం. ఇలా... బౌద్ధం ప్రారంభ దశలో సుత్తపిటకం, వినయ పిటకం అనే పాళీ సూత్రాలపైనా, నికాయ (ఆగమ) సూత్రాలపైనా ఆధారపడింది. (అభిప్రాయభేదాలున్నాయి). బౌద్ధం ఇలా సాగుతుంది....
మూడు జీవ లక్షణాలు: అనిత్యం, దుఃఖం, అనాత్మత, అయిదు కంధాలు: ఆకారం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం, ప్రతిసముత్పాదన: ఒకదాని కారణంగా మరొకటి జరగడం, కర్మ, పునర్జన్మ, నాలుగు మహోన్నత సత్యాలు: దుఃఖం: సముదాయం, నిరోధం, మార్గం, అష్టాంగ మార్గం: సమ్యక్‌ వచనం, సమ్యక్‌ కర్మ, సమ్యక్‌ జీవనం, సమ్యక్‌ వ్యాయామం, సమ్యక్‌ స్మృతి, సమ్యక్‌ సమాధి, సమ్యక్‌ దృష్టి, సమ్యక్‌ సంకల్పం.
సుఖాపేక్ష ఉంటే బాధలు తప్పవు. దుఃఖం దూరం కావాలంటే సుఖాలను ఒదులుకోవాలి.అష్టాంగ మార్గం ద్వారా సుఖాపేక్షను త్యజించవచ్చు. ఇవి బౌద్ధం బోధించే అంశాలు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి