కాంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయం
ప్రపంచంలో అనేక దేశాలు మత విశ్వాసాలకు గౌరవం ఇవ్వడం తెలిసిందే. మత సిద్ధాంతాలను పరిపాలనకు మార్గదర్శకాలుగా ఉన్న దేశాలనూ చూశాం. కానీ దేశంలో ప్రసిద్ధి పొందిన ఆలయాన్ని తమ జాతీయ జెండాలో ముద్రించుకున్న ఘనత ఒక్క కాంబోడియాకే సాధ్యం. అంత ఘనత వహించిన ఆలయం నిర్లక్ష్య నీడలో శిథిలావస్థకు చేరింది. ఇంకా ఏమరుపాటుగా ఉంటే అంకోర్ వాట్ అనేది చరిత్రగానే మిగిలేది.
ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకే కాంబోడియా రాజు, ప్రధాని పురాతన ఆలయానికి
కొత్త సొగసులు అద్దే పనిలో తాళాలు తీయించారు. ఇంతకీ ఈ ఆలయానికున్న చరిత్ర
ఏంటి..? జాతీయ చిహ్నంగా ఒక హిందూ ఆలయాన్ని ముద్రించుకోవాల్సిన అవసరం
ఏమొచ్చింది. ఆలయ చరిత్రేంటో తెలుసుకుందాం.
అంకోర్ వాటి ఆలయం అతి పురాతన మైంది. మూడు శతాబ్దాల పాటు వెలుగులీనిన
ఆలయానికి 11వ శతాబ్దంలో తలుపులకు మూతలు పడ్డాయి. ఆంకూర్ వాట్ ఈ భూగోళం
పైనే ఒక అధ్బుత ప్రాంతం. ఈ ఆలయం కాంబోడియాలో సీమ్ రీప్ నగరానికి
5.5కిలోమీటర్ల దూరంలో బాఫౌన్ పట్టణం మధ్యలో ఉంది. 1113, 1150మద్యకాలంలో
ఈప్రాంతాన్ని పాలించిన రెండవ సూర్యవర్మ ఈ ఆలయాన్ని నిర్మించి విష్ణు
భగవానుణ్ని ప్రతిష్టించాడు. తరువాత కొంతకాలానికి రాజు మరణించడంతో ఈ ఆలయ
నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయింది. 27సంవత్సరాల తర్వాత 8వజయవర్మ ఆంకోర్
థోమ్ ను రాజధానిగా చేసుకున్నాడు. తర్వాత ఆయన అల్లుడు శ్రీంద్రవర్మ రాజు
అయ్యాడు.
ఆయన అంతకు ముందు బౌద్ధ సన్యాసిగా ఉండడంతో దాన్ని బౌద్ధ ఆలయంగా మార్చారు.
13వ శతాబ్దంలో బౌద్దమతం ప్రాచుర్యంలోకి వచ్చాక ఇక్కడ బౌద్దమతస్థులకు కూడా
ఆశ్రయం కల్పించడంతోబాటు బౌద్దానికి సంబంధించిన వివిధ ప్రతిమలు
ప్రతిష్టించబడినవి. ప్రపంచంలోనే అతిపురాతన అరుదైన నిర్మాణాలలో ఈ ఆలయమొకటి.
అంకూర్ వాట్ ఆలయం నైరుతి కాంబోడియాలో అంకోర్ ప్రాంతంలో ఉంది.
దక్షిణాసియాలోనే అత్యంత ప్రాచీన నాగరికత ఇక్కడ విలసిల్లింది. 2వ రాజా
సూర్యవర్మన్ నిర్మించిన ఈ ఆలయం మత విశ్వాసాలకు పుట్టినిల్లు. హిందూ మతం
ఇక్కడ బహుళ ప్రాచుర్యం పొందింది. తరువాత బౌద్దాన్ని కూడా ఆదరించారు.
ఇది ప్రపంచంలోనే పెద్ద ధార్మికాలయం. కిమర్ రాజవంశీయుల వాస్తు,
శిల్పకళానైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయం అతి పురాతన సంప్రదాయ నిర్మాణ శైలి
కలిగి ఉంది. ఈ ఆలయం ఒక అద్భుత కట్టడం. ఒక్కసారి ఈ ఆలయం మొత్తం
కలియతిరిగిచూద్దాం.
ఆలయంలో చూడాల్సిన విశేషాలేంటి..?
ప్రపంచంలో ఎన్నో ఆలయాలున్నాయి. కానీ అంకోర్ వాట్ ఆలయమే ప్రపంచంలో అతి
గొప్ప ఆలయంగా ఎలా పేరు పొందింది. ఈ ఆలయ గొప్పతనం ఏంటి.. అసలు ఈ ఆలయంలో
చూడాల్సిన విశేషాలేంటి..? ఆలయ గోడలపై, స్తంభాలపై రకరకాల చిత్రాలను
చెక్కారు. పాలసముద్రాన్ని చిలుకుతున్న దేవతలు, రాక్షసులు. నాట్యం చేస్తున్న
సుందరాంగులు, రణరంగంలో కృష్ణుడు, కౌరవులు, పాండవుల చిత్రాలు.. ఆలయ
ప్రాంగణంలో అక్కడక్కడ కొలనులు, మార్గమధ్యలో పలకరించే సింహాలు అక్కడ ఉన్నంత
సేపూ కథల్లో విన్న, సినిమాల్లో చూసిన పౌరాణికగాథలు మనముందు
ప్రత్యక్షమైనట్టుంటుంది.
ఆ లోకంలో విహరిస్తున్నట్టనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాకారాలు, ప్రాకారాలపై
శిల్ప సంపద చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లు.. పచ్చిక మైదానాలు ప్రశాంత
వాతావరణానికి అచ్చమైన ఆనవాలు ఇది. ఈ ఆలయం బాహ్య ప్రాకారం 3కిలోమీటర్లు
ఉంటుందంటే లోపల ఎంత విశాలంగా ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి పురాతన
చరిత్ర ఉంది. ఆలయ ప్రాంగణలోనే జలాశయాలు మద్య మద్యలో సేదతీరేందుకు రాతి
బల్లలు. అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దిన క్షేత్రమిది. సనాతన సంప్రదాయాలకు,
మత విశ్వాసాలకు పురిటిగడ్డగా విలసిల్లిన దివ్యక్షేత్రమిది.
పర్వత శిఖరాలను తలపిస్తున్న ఆలయం మధ్యలో ఉన్న ఐదు శిఖరాలు
ఏ ఆలయానికైనా ముఖమంటపం.. ఆలయ శిఖరం ఉండటం చూస్తాం. కానీ ఈ ఆలయానికి
ప్రహరీ మధ్యలో ఐదు శిఖరాలున్నాయి. నాలుగు వైపులా నాలుగు శిఖరాలు మధ్యలో
ప్రధాన శిఖరం అత్యంత శిల్ప కళా నైపుణ్యంతో చూపరులను ఆకట్టుకుంటాయి. ఆలయం
ప్రాకారాలపై ఉన్న చిత్రాలు, కళా ఖండాలు, ప్రాంగణంలో ఉన్న శిల్పాలు ఎంత
చూసినా తనివి తీరదు. ఆలయం మధ్యలో ఉన్న ఐదు శిఖరాలు పర్వత శిఖరాలను
తలపిస్తాయి. ఆలయం చుట్టూ గోడలు, వాటి చుట్టూ ఆలయాన్ని రక్షించేందుకు ఎత్తైన
కోటగోడ ఉంటాయి.
ఆలయం బయటి గోడలు, కొన్ని రహస్య నిర్మాణ భాగాలు తప్ప మిగతా అన్నిటినీ
ఇసుకరాతితోనే నిర్మించారు. తామర మొగ్గల ఆకారంలో ఆలయ గోపురాలు, సందర్శకులు
వెళ్లే మార్గాలను కలుపుతూ ప్రదర్శనశాలలు, ఎత్తైన ఆలయ శిఖరాలు మనల్ని ఎంతో
ఆకర్షిస్తాయి. ఆలయ ప్రహరీ గోడ 1024 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తుతో
ఉంటుంది. ప్రధాన ద్వారం చెక్క వంతెనతో ఉంటుంది. అతి ముఖ్యమైన ప్రదేశాలలో
గోపురాలు ఉంటాయి. ఆలయానికి పశ్చిమాన చాలా విశాలంగా ఉంటుంది. దక్షిణాన గల
శిఖరం కింద విష్ణువు విగ్రహం ఉంటుంది. మధ్యలోని పవిత్ర మందిరంలో ఉంచారు.
దీనిని 'తారీచ్ ' అంటారు.
ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి. వీటిని ఏనుగు ద్వారాలు అంటారు. వీటి
మధ్య చాలా దూరం ఉంటుంది. మధ్య మధ్యలో శిఖరాలు, ప్రదర్శనశాలలు ఉంటాయి. శిఖర
గోడలపై నాట్యం చేస్తున్న ఆకారాలు, జంతువులపై నాట్యం చేస్తున్న దేవుళ్లు,
దేవతల రూపాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. వాయవ్య దిశగా చూస్తే ఈ ఆలయం
నగరాన్ని మొత్తం ఆక్రమించినట్టుగా ఉంటుంది. దీనికి ఉత్తరాన రాజ భవనం
ఉంటుంది. 350మీటర్ల మార్గం పశ్చిమాన ఉన్న గోపురాన్ని కలుపుతుంది. ఈ
మార్గంలో అక్కడక్కడా సింహాల శిల్పాలు మనల్ని పలకరిస్తాయి.
ఆలయ భద్రతపై కాంబోడియా ప్రభుత్వం దృష్టి
సుప్రసిద్ధమైన ప్రపంచంలోనే పెద్దదైన ఈ విష్ణుమందిరాన్ని కాంబోడియా
ప్రభుత్వం భద్రంగా కాపాడబడబోతోంది. ఈ ఆలయంలో చరిత్రతో బాటు, పురాణ గాథలు
చెక్కు చెదరకుండా శిలాశాసనాల రూపంలో ఉన్నాయి. అంకోర్ వాట్ గోడలపై సంపూర్ణ
రామాయణంను చిత్రీకరించారు. కాంబోడియా, లావోస్ భాషలు సంస్కృత పదాల
ఆధారంగానే ఉన్నాయి. విజ్ఞాన, ఇతర ఉపయుక్త భాషలలోని పదాలూ సంస్కృతానికి
చెందినవే. అక్కడి భాషల లిపి భారతీయ ప్రాచీన బ్రాహ్మీలిపి నుండి పుట్టినవే.
చరిత్రకారులు అంకోర్ వాట్ విరాట్ మందిరంను పరిశోధించి, కాంబోడియా
లోని సంస్కృతభాషకు చెందిన వేలాది శిలా శాసనాలను సేకరించి పుస్తక రూపంలో
ప్రచురించారు. ఆలయ ద్వారాల వద్ద వున్న గ్రంథాలయాలు దీనికి సంబంధించిన
చరిత్రతెలుసుకునేందుకు వీలుగా ఉంటాయి. ఈ గ్రంథాలయాలకు ఆలయానికి మధ్య
కొలనులు ఉంటాయి. ఈ కొలనులు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినవి. టెర్రస్
మీదనున్న ఆలయం.. నగరం కంటే ఎత్తులో ఉంటుంది. ఇది మూడు దీర్ఘ చతురస్రాకార
ప్రాకారాలతో ఉంటుంది. ఇవి ఒకదానిని మించి మరొకటి ఎత్తులో ఉంటాయి.
ఈ మూడింటిని బ్రహ్మ, చంద్రుడు, విష్ణులతో పోలుస్తారు. ఇక్కడ నాలుగు భవన
ప్రాకారాలు ఉంటాయి. వీటి గోడలపై దేవతల రూపాలు విడివిడిగా, గుంపులు
గుంపులుగా ఉంటాయి. లోపలి మ్యూజియమ్ ను బాకన్ అంటారు. ఇది 60మీటర్ల
చతురస్రాకారంలో ఉంటుంది. దీని పైకప్పు అడుగుభాగాన పాము శరీరంతో, సింహం లేదా
గద్ద తల ఉన్న ఆకారంతో వింత రూపాన్ని చెక్కారు. ఈ ప్రాకారాల గోడలపై
మహాకావ్యాలైన రామాయణం, మహాభారత చిత్రాలను చెక్కారు.
ఆలయాన్ని సూర్యవర్మ ఎందుకు నిర్మించాడు..?
ఇంత పెద్ద ఆలయం ఇంత భారీ ఖర్చుతో నిర్మించ వలసిన అవసం
సూర్యవర్మకెందుకొచ్చింది. హిందు మతం పై అభిమానం ఉండటంలో తప్పు లేదు. కానీ
తమది కాని మతాన్ని అంతగా ఎందుకు ఆదరించాడు. ఆచరించడమే కాకుండా ప్రపంచంలో తన
రాజ్యంలో ఉన్నంత పెద్ద ఆలయం మరే రాజ్యంలో కూడా ఉండకూడదన్న ఆలోచన
ఎందుకొచ్చింది. ఈ ఆలయాన్ని భక్తితోనే కట్టాడా.. గుర్తింపు కోసం కట్టాడా...
అసలీ ఆలయాన్ని సూర్యవర్మ ఎందుకు నిర్మించాడు.
కాంబోడియా రాజ్యం థాయిలాండ్, లావోస్, చైనా, బర్మా, భారత్, చైనాలతో
వ్యాపార లావాదేవీలు జరిపేది.. సంస్కృతి పరంగా కాంబోడియా చాలా వెనక బడిన
ప్రాంతం భారత్, థాయ్ లాండ్ ప్రాంతాలను సందర్శించినపుడు ఇక్కడి సంస్కృతి,
సంప్రదాయాలను చూసి కాంబోడియన్ రాజులు ఆశ్యర్యపోయారు. ఇక్కడి శిల్ప సంపద..
ఆద్యాత్మిక పద్దతులు తమ దేశ ప్రజల చేత కూడా పాటించాలనుకున్నారు. అంతేకాదు
ఇతర రాజ్యాలు గా కాంబోడియాను ఆదివాసీ రాజ్యం పరిగణించడం వీరికి నచ్చలేదు.
వెనకబడిని రాజ్యంగా అవహేళనలు పొందిన రాజులు తమను తాము నిరూపించుకోవాలని తపన
పడ్డారు.
ఏ దేశానికీ తాము తక్కువ కాదని తమ వారిలో కూడా నైపుణ్యం ఉందని రుజువు
చేయదల్చుకున్నారు. తమ రాజ్యంలో ఉన్న ఔత్సాహిక శిల్పులను, వాస్తు నిపుణులను,
సరిహద్దు దేశాలకు పంపించి ఇక్కడి నిర్మాణ నైపుణ్యాలలో శిక్షణ నిప్పించారు.
అంతే కాకుండా ఆయా దేశాలలో పేరొందిన నిపుణులను కాంబోడియాకు పిలిపించుకొని
శిక్షణ నిప్పించారు. వీరందరినీ ఒక్కచోట చేర్చి ప్రపంచంలో ఉన్న హైందవ
దేవాలయాలన్నిటికన్నా తామే అద్భుతమైన ఆలయాన్ని నిర్మించామని గర్వంగా చెప్పే
ప్రయత్నం చేశాడు రెండవ సూర్యవర్మ అతని కాలంలో అది పూర్తి కాకపోయినా తరువాత
వచ్చిన రాజులు పూర్తి చేసి కాంబోడియా రాజుల ఆశయాన్ని సాధించారు.
అవును ప్రపంచంలో మారుమూలన ఉన్న తమ రాజ్యం ఇప్పుడు చరిత్ర పుటల్లో
నిలిచింది. అనాగరికులని అవహేళన చేసిన వారే అద్భుత పనితనమని పొగుడుతున్నారు.
వేలాది కార్మికుల శ్రమ ఊరికే పోలేదు. చరిత్రలో శిలాశాసనంలా మిగిలిపోయింది.
కాల గర్భంలో వచ్చిన పౌర యుద్దాలు... రాజ్యాధికార కాంక్షలు.. రాజ్య
ధిక్కారాలు.. ఈ ఆలయపునరుద్దరణ కంటే వినాశనానికే ఎక్కువగా దారి తీశాయి.
మళ్లీ ఇన్నాళ్లకు ఆలయానికి గతవైభవం సంతరించుకోబోతోంది. ఎన్నో వ్యయ
ప్రయాసలకోర్చి నిర్మించిన ఈ ఆలయానికి ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఆలయానికి
మరమ్మత్తులు చేసి పునర్ వైభవం కల్పించబోతున్నారు.
చాలా సంవత్సరాల తరువాత కాంబోడియా రాజు, ధాని ఈ పనికి పూనుకున్నారు.
అత్యంత శ్రేష్టమైన, ప్రసిద్దమైన ఈ ఆలయ పరిరక్షణకు నడుం బిగించారు. ఈ ఆలయ
శిఖరాలలో 3లక్షల ఇసుక ఇటుకలున్నాయని అంచనా. 1970ప్రాంతంలో జరిగిన సివిల్
వార్ లో ఆలయం పై దాడి జరిగింది. తిరుగుబాటు దారుల కళ్లు ఈ ఆలయంపై పడ్డాయి. ఈ
ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కొన్ని శిల్పాలు పాక్షికంగా
ధ్వంసం కాగా మరికొన్ని శిల్పాలు పూర్తిగా ఆకారాలను కోల్పోయాయి. శిధిలమయిన
ఇటుకలను తిరిగి పేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆలయ ప్రాకారాలకు
సంబంధించిన అనేక ఇటుకలు ఆలయ పరిసరప్రాంతాలలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
ఈ ఆలయం మొత్తం రాతికట్టడమే. ఎక్కణ్నుంచి తీసిన ఇటుకలను, శిల్పాలను
అక్కడే అమర్చాలంటే ఆలయ నమూనా కావాలి. కానీ కిమర్ రాజులపై తిరగబడ్డ
ఉద్యమకారులు 1975లోనే వాటిన ధ్వంసం చేశారు. తిరిగి 1995లో ఈ ఆలయం
ప్రపంచంలోనే అరుదైన ఆలయంగా గుర్తించి కాంబోడియా రాజు, ప్రధాని ఆలయ
పునరుద్దరణకు పూనుకున్నారు. అశేష ప్రజల కోలాహలం మద్య పున:ప్రారంభం అవుతున్న
ఈ ఆలయం పేరు అంకోర్ వాట్ కాంబోడియా చరిత్రలో ఎంతో విషిష్టత కలిగిన ఈ ఆలయం
దక్షిణ భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో, శిల్పకళా నైపుణ్యంతో
నిర్మించారు.
అన్ని ఆలయాలకు ప్రవేశ ద్వారం తూర్పు వైపునకు ఉంటే ఈ ఆలయానికి మాత్రం
ప్రవేశ ద్వారం పశ్చిమం వైపు ఉంటుంది. నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహం
నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. ఈ ఆలయం కాంబోడియన్ల గుండెల్లో గుడి
కట్టుంకుంది. ఈ గుడికి వీళ్లెంత గౌరవం ఇచ్చారంటే ఆ దేశ జాతీయ పతాకంలో కూడా ఈ
గుడిని గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కట్టడాన్ని నిర్మించాలంటే
300 సంవత్సరాలు పడుతుందని ఇంజనీర్ల అభిప్రాయం. కాని అప్పుడు మాత్రం దీన్ని
40సంవత్సరాలలోనే నిర్మించారట. రథాలను లాగుతున్న వింత జంతువులు, ఏనుగుల వెంట
వెళ్తున్న సైనికులు, నాట్యం చేస్తున్న అందమైన అమ్మాయిలు.. ఆనాటి చరిత్రను
కళ్లకు కడతయి.
2004, 2005 సంవత్సరాలలో 6,77,000 మంది విదేశీ పర్యాటకులు ఈ ఆలయాన్ని
సందర్శించారని ప్రభుత్వ అంచనా. ఆంకోర్ నిర్మాణం తర్వాత కిమర్ రాజులు
వియత్నాం, చైనాల నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు చాలా సంవత్సరాలు
పరిపాలించారు. ఇప్పటికీ చెక్కుచెదరని వందకు పైగా రాతి ఆలయాలున్నాయి. ఈ
ఆలయంలో 108 హిందూ, బౌద్ధ శిఖరాలు ఉన్నాయి. ఆంకోర్ కు నగరదేవాలయం అని పేరు
పెట్టారు.
చరిత్రను ముందు తరాలకు అందించేవి చారిత్రక కట్టడాలే.. వాటిని కాపాడుకోవడం
పౌరుల, ప్రభుత్వాల బాధ్యత. దేశమేదైనా కావచ్చు. చరిత్ర ఏదైనా కావచ్చు.
దాన్ని ముందు తరాలకు అందిస్తేనే మన వైభవం తెలుస్తుంది. ఇదీ కాంబోడియా
అంకోర్ వాట్ ఆలయ విశిష్టత.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి