థేరవాద బౌద్ధంలో - జన్మ జన్మల వేదన, సాధన అనంతరం సత్యాన్ని తెలిసికొని అజ్ఞానాంధకారంనుండి బయటపడి, ఇతరులకు ఆ మార్గాన్ని ఉపదేశించినవారు "బుద్ధులు" అవుతారు. సత్యాన్ని తెలిసికొన్నాగాని ఇతరులకు ఉపదేశం చేయనివారు "ప్రత్యేక బుద్ధులు" అవుతారు. శాక్యముని గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు. అంతకు పూర్వము, ఇంకా ముందు కాలంలోను ఎందరో బుద్ధులు ఉంటారు. సత్యాన్ని తెలుసుకొన్న గౌతమబుద్ధుడు అనేక బుద్ధులలో ఒకడు. బుద్ధుని బోధనలలో "నాలుగు ఆర్య సత్యాలు" ప్రముఖ పాత్ర కలిగి ఉన్నాయి. దుఃఖం లక్షణం, దానికి కారణం, దుఃఖ నివారణ, నివారణా మార్గం - ఇవి ఆ నాలుగు ఆర్య సత్యాలు అలా దుఃఖాన్ని నివారించే మార్గం "అష్టాంగ మార్గం".
బుద్ధుని అనంతరం బౌద్దాన్ని ఆచరించేవారిలో అనేక విభాగాలు ఏర్పడినాయి. వారి ఆచరణలోను, సిద్ధాంతాలలోను, సంస్కృతిలోను నెలకొన్న వైవిధ్యం కారణంగా బౌద్ధం అంటే ఇది అని స్పష్టంగా అందరికీ వర్తించే విషయాలు క్రోడీకరించడం కష్టమవుతున్నది.
బోధి:--
బోధి అనగా "నిద్ర లేచుట" - థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను "బోధి" అంటారు. జన్మ జన్మల సాధన, ధ్యానం తరువాతనే ఈ స్థితి సాధ్యమవుతుంది. బౌద్ధం ఆరంభ దశలో "బోధి", "నిర్వాణం" అనే పదాలు ఒకే అర్ధంలో వాడబడ్డాయి. రాగ, ద్వేష, మోహాలు అంతరించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన లక్షణం.
తరువాత వచ్చిన మహాయాన సిద్ధాంతాలలో "నిర్వాణం" అనే స్థితి "బుద్ధత్వం" కంటే కొంత తగ్గింది. రాగ ద్వేషాలనుండి విముక్తి కలిగితే అది నిర్వాణం అవుతుంది, అనగా ఇంకా మోహం ఉంటుంది. ఈ మోహం కూడా తొలగిపోయినపుడు "బోధి" స్థితి లభిస్తుంది. మహాయానంలోని ఈ సిద్ధాంతం ప్రకారం అరహంతులు నిర్వాణాన్ని పొందుతారు కాని, ఇంకా మోహంనుండి విముక్తులు కానందున వారు బోధిత్వం పొందరు. కాని థేరవాదంలోని నమ్మకం ప్రకారం అరహంతులు రాగ, ద్వేష, మోహాలనుండి విముక్తి పొదిన బోధులు.
బోధిత్వం పొందడానికి "నాలుగు ఆర్యసత్యాలను" సంపూర్ణంగా తెలుసుకోవాలి. అందువలన కర్మ నశిస్తుంది. బౌద్ధం ఆరంభ దశలో "పారమిత"ను ప్రస్తావించలేదు అయితే తరువాత వచ్చిన థేరవాద, మహాయాన బౌద్ధ సాహిత్యంలో "పారమిత" సాధన కూడా అవసరం. బోధిత్వం పొదినవారు జనన, మరణ, పుర్జన్మ భూయిష్టమైన సంసార చక్రంనుండి విముక్తులవుతారు. మాయ తొలగిపోయినందువలన "అనాత్మత" అనే సత్యాన్ని తెలుసుకొంటారు.
మధ్యేమార్గం:---
బౌద్ధ మతం సాంప్రదాయాలలోను, విశ్వాసాలలోను మధ్యేమార్గం చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. శాక్యముని గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయానికి ముందు ఈ మార్గాన్ని అవగతం చేసుకొన్నాడని ప్రతీతి. "మధ్యేమార్గం" అన్న పదానికి వివిధ వివరణలు ఉన్నాయి
1.కఠోరమైన దీక్షతో శరీరాన్ని మనస్సును కష్టపెట్టకుండా, అలాగని భోగ లాలసత్వంలో మునగకుండా మధ్య విధంగా సాధన, జీవితం సాగించడం.
2.తత్వ చింతనలో చివరకు "ఇది ఉంది" లేదా "ఇది లేదు" అన్న పిడివాదనలకు పోకుండా మధ్యస్తంగా ఆలోచించడం
3.నిర్వాణంలో ఈ విధమైన ద్వివిధ, విరుద్ధ భావాలు అంతమై పరిపూర్ణమైన జ్ఞానం కలుగడం.
త్రిరత్నాల శరణు:---
సంప్రదాయానుసారంగా త్రిరత్నాలు లేదా రత్నత్రయం శరణు జొచ్చుట బౌద్ధం ఆచరణలో ప్రాధమిక ప్రక్రియ. "బుద్ధుడు", "ధర్మము", సంఘము" అనేవే ఈ త్రిరత్నాలు. దాదాపు బౌద్ధమతావలంబనలో ఇది మొదటి మెట్టుగా భావింపబడుతుంది. ఈ మూడింటికి అదనంగా "లామ" (దీక్ష) అనే నాల్గవ శరణు కూడా టిబెటన్ బౌద్ధంలో పాటించబడుతుంది.
బుద్ధుడు
జ్ఞానోదయమైన, ధర్మ మార్గాన్ని ఎరిగిన అరహంతుల మార్గాన్ని ఆచరించడం.
ధర్మము
బుద్ధుడు తెలిపిన మార్గము. సత్యానికి, అసత్యానికి ఉన్న భేదము. పరమ సత్యము
సంఘము
బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణా మార్గంలో పురోగమిస్తున్నవారి సహవాసం. కొన్ని వివరణల ప్రకారం భౌక్షుకుల సాధనకు సహకరిస్తున్న సామాన్య జనులు కూడా సంఘంలోని వారే.
"బుద్ధుడు" తాను కనుగొన్న మార్గాన్ని ఇతరులు గ్రుడ్డిగా ఆచరించమని చెప్పలేదు. శ్రద్ధతో ఎవరికి వారే తాను బోధించిన "ధర్మము"ను ఆలంబనగా గైకొని స్వయంగా యుక్తాయుక్తాలు విచారించి, "సంఘము" సహకారంతో సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని అందరికీ సాధనలో అందుబాటులో ఉంచే సముదాయమే సంఘం.
మహాయానంలో బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు. అనంతమైన ధర్మరూపం. కొన్ని మహాయాన సూత్రాలలో బుద్ధుడు, ధర్మము, సంఘము అనే మూడు భావాలూ అవినాభావమైన శాశ్వతత్వానికి ప్రతీకలుగా భావించబడుతాయి. చాలా మంది బౌద్ధులు వేరే లోకంలో తమ కర్మలకు విముక్తి కలుగుతుందని విశ్వసించరు. అష్టాంగ మార్గం ద్వారానే దుఃఖభూయిష్టమైన కర్మలనుండి విమోచన కలుగుతుందని భావిస్తారు. కాని మహాయానంలో కొన్ని సూత్రాల ప్రకారం శ్రవణం, మననం వంటి సాధనల ద్వారా కర్మ బంధాలనుండి విముక్తి కలుగవచ్చునని ఉంది.
నాలుగు మహోన్నత సత్యాలు:---
బౌద్ధమతంలో "నాలుగు పరమసత్యాలు" ప్రవచింపబడ్డాయి. అవి
1.దుఃఖము
2.దుఃఖానికి కారణము
3.దుఃఖంనుండి విముక్తి
4.దుఃఖాన్నిండి ముక్తిని పొందే మార్గం
ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధిని మొదటి బోధనలు, "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం)గా చెప్పాడు. థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి. దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు.
అష్టాంగ మార్గం:--
నాలుగు పరమ సత్యాలలో నాలగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం.ఆరంభ కాలం బౌద్ధ గ్రంధాలలో (నాలుగు నికాయాలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు.అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది. శీలము (భౌతికమైన చర్యలు), సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము), ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)
శీలము - శరీరం, మాటల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:
1."సమ్యక్ వచనము" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
2."సమ్యక్ కర్మము" - హాని కలిగించే పనులు చేయకుండుట
3."సమ్యక్ జీవనము" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
సమాధి - మనసును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు సంగాలు ఉన్నాయి.
4."సమ్యక్ వ్యాయామము" - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
5."సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం
6."సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలుకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం
ప్రజ్ఞ - మనసును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.
7."సమ్యక్ దృష్టి" - అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం
8."సమ్యక్ సంకల్పము" - ఆలోచించే విధానంలో మార్పు
ఈ ఎనిమిది మార్గాలను పలు విధాలుగా వివరిస్తారు, విశ్లేషిస్తారు. సాధనలో ఒకో మెట్టూ ఎదగవచ్చునని కొందరంటారు. అలా కాక అన్ని మార్గాలనూ ఉమ్మడిగా ఆచరించాలని మరొక భావన.
This subject subject is fine
రిప్లయితొలగించండిBuddhism introduction in Telugu is great for telugu people, who do not know Gowtam Buddha much. Thank You.
రిప్లయితొలగించండిరాజ్యం వ్యవహరించ వలసిన విధానాలను బుద్దుడు ఏమైనా తెలియజేసారా? తెలుపగలరు.
రిప్లయితొలగించండి