18, జనవరి 2013, శుక్రవారం

భట్టిప్రోలు

బౌద్ధ పరిమళాలు వెదజల్లిన... భట్టిప్రోలు
రాష్ట్ర చరిత్రలో ప్రాచీనాంధ్ర నగరమైన భట్టిప్రోలుది విశిష్టస్థానం. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ బౌద్ధారామాలలో ఒకటిగా కీర్తించబడుతున్న బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది. క్రీపూ 4-3 శతాబ్దాల నాటి ఈ స్థూపం... భవననిర్మాణ రీతుల్లోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నారుు. గౌతమ బుద్ధుడు, జైన తీర్థంకరుడైన మహావీరుడు దర్శించినట్టుగా చెప్పబడుతున్న గుంటూరు జిల్లాలోని ఆ అద్భుత చారిత్రక క్షేత్రం ‘భట్టిప్రోలు’ వైశిష్ట్యం తెలుసుకుందాం.....

Bhataట్టిప్రోలు ప్రాచీననామం ప్రతీపాలపురం. ఆంధ్ర శాతవాహనుల కాలానికి పూర్వం నుండే ఉన్న ప్రముఖ నగరం ఇది. సారవంతమైన కృష్ణానది మైదానంలో... సముద్ర తీరానికి సమీపానగల ఈ ప్రాచీన నగరం... అక్కడ తవ్వకాలలో బయటపడిన బౌద్ధ స్థూపం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. భట్టిప్రోలుకు సమీపంలో ఉన్న పోతవరలంక వరకు పెద్ద పడవలు, నౌకలు వచ్చేవనీ, అక్కడి నుండి వరి ధాన్యము, దినుసులు, వస్త్రాలు ఎగుమతి అవుతుండేవనీ, జౌళి పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రంగా ఈ నగరం విరాజిల్లిందని చరిత్రకారుల అభిప్రాయం.

ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్ర ఇలా భట్టిప్రోలు అనేక పేర్లున్నాయి. క్రీశ 8వ శతాబ్దానికి చెందిన జైనకవి నయసేనాని వ్రాసిన ‘ధర్మామృత’ కావ్యంలో ప్రతీపాలపురం ప్రసక్తి ఉంది. ఇది క్రీశ 5వ శతాబ్దంలో జరిగిన కథ. ఇక్ష్వాకు రాకుమారుడైన యశోధరుడు దక్షిణదేశానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజధానిగా పాలన చేశాడు. ఇతని వారసుడు ధనదుడు జైన మతాన్ని వదిలి బౌద్ధురాలైన కమలశ్రీని పెళ్ళి చేసు కుంటాడు. ఈ కథ బృహత్కథాకోశంలో కూడా ఉంది. ధనదుడు తన పేర ధనదపురం నిర్మించాడనీ, అదే నేటి చందోలు అని చరిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలులో లభించిన శాసనాలలో ‘కుబీరక’ రాజు ప్రసక్తి ఉంది. ధనదుడి కి కుభీరక, కుబేర అనే పేర్లు కూడా ఉన్నాయి.

జైన రాజైన ఖారవేలుడు పితుడ్రనగరంలోని బౌద్ధక్షేత్రాన్ని గాడిదలతో దున్నించి నాశనం చేశాడని ‘ఖారవేలు’ని శాసనాల్లో చెప్పబడినది. ఆ శాసనాల్లో పితుడ్రనగరం భట్టిప్రోలేనని చరిత్రకారులు భావిస్తున్నారు.

చారిత్రక శిథిలాలు...
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్థూపం చరిత్ర తెలుసుకునేందుకు భారతీయులకంటే విదేశీయులే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. క్రీశ 1870లో బోస్‌వెల్‌, 1871లో ఇర్లియట్‌, 1882లో రాబర్ట్‌ సెవెల్‌ అనే విదేశీయులు భట్టిప్రోలును సందర్శించారు. 1892లో అలెగ్జాండర్‌ జరిపిన తవ్వకాల్లో రాతి ధాతుకరండాన్ని కనుగొన్నారు. 1969-70 సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరపును ఆర్‌. సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరిపారు. అప్పుడు ఒక విహారపు పునాదులు బయటపడ్డాయి. బుద్దుని తల ప్రతిమ వెలుగుచూసింది. పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. పురావస్తు శాఖ అంచనా ప్రకారం క్రీపూ 3వ శతాబ్దంలో ఇది నిర్మాణం జరిగిందని తెలుస్తోంది.

లాంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్థూపం, కోట గోడలు కనపడ్డాయట. స్థూపప్రాకారంలో చలువరాతి పలకలు, గోడలో ఇమిడిన నలుచదరపు స్థంభాలు, ఆయక వేదికలు, చక్కగా చెక్కిన బొమ్మలు ఉన్నాయి. ఆయక స్థంభం ఎత్తు 15 అడుగులు. వాటిపై మనుషుల, జంతువుల బొమ్మలు చెక్కి వున్నాయి. ప్రదక్షిణాపథానికి అంచున 4 అడుగుల ఎత్తువరకు పాలరాతి గోడ ఉండేది. ఇక్కడి స్థూపం 132 అడుగులు, వేదిక 148 అడుగుల వ్యాసాలతో ఉంది. 8 అడుగుల ఎత్తు, 8.4 అడుగుల వెడల్పు, ప్రదక్షిణా పథం నలుదిక్కులా అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించిందని చెబుతారు.

భట్టిప్రోలు స్థూప తవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బిట్రీష్‌ ప్రభుత్వం భద్రపర్చింది. 1892వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించిన ‘మహాబోధి సొసైటీ ఆఫ్‌ ఇండియా’కు నూతన స్థూపంలో నిక్షిప్తం చేసేందుకు వాటిని ఇవ్వటానికి అంగీకరించింది. 1893లో అమెరికాలో జరిగిన విశ్వమత మహాసభలకు హాజరైన శ్రీలంక బౌద్ద బిక్షువు అనగారిక ధర్మపాల ఈ సంస్థను స్థాపించారు. 1920వ సంవత్సరంలో కలకత్తాలోని ‘శ్రీధర్మరాజిక విహార్‌’లోని నూతన స్థూపంలో భట్టిప్రోలులోని బుద్ద ధాతువులున్న స్పటిక పేటికను నిక్షిప్తం చేశారు. అంతటి ప్రాముఖ్యతగల ఈ చారిత్రక ప్రదేశంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం విచిత్రం.

స్థూప విశిష్టత...
Bhattiaభట్టిప్రోలు స్థూపాన్ని ధాతుగర్భం అంటారు. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడినది అని అర్థం. శాసనాల్లోని ‘బుద్ధ శరీరాని నిఖేతుం’, ‘బుద్ధ శరీరాని మహనీయాని కమ్మనే’ అనే వాక్యాలనుబట్టి స్థూపం యదార్ధమైన బుద్ధ ధాతువుపై నిర్మించబడినట్లు స్పష్టమవుతోంది. స్థూపం మధ్య రంధ్రం ఉన్నది. రంధ్రం చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్థూపం పైన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రం గుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.ఆంధ్రులు ఒక విశిష్టమైన స్థూప నిర్మాణశైలిని అభివృద్ధి చేశారు.

ఇందు ఆయక స్థంభాలు ప్రధానమైన సాక్ష్యాలుగా నిలు స్తున్నాయి. చక్రాకార స్థూపనిర్మాణం భట్టిప్రోలులో ప్రారంభమై అమరావతి, నాగార్జునకొండ స్థూపాల్లో పరిణితి చెందింది. చక్రాకార వైశిష్ట్యం ఏమిటంటే, స్థూపానికి పటుత్వం, పవిత్ర ధర్మచక్ర ప్రతిష్ఠ. అనగా నిర్మాణ సౌష్ఠవం, ధర్మభావ వ్యక్తీకరణల మేళవింపు. చక్రాకార స్థూపంలోని ఆకుల సంఖ్య ధర్మభావాలకు ప్రతీకలుగా చెబుతారు.

భాష, లిపి...
స్థూపంలో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నీ ఈ లిపినుండే పరిణామం చెందాయి. బౌద్ధమతంతోబాటు భట్టిప్రోలు లిపి కూడా దక్షిణాసియా ఖండంలో వ్యాపించి బర్మా, మలయా, థాయి, లావోస్‌, కంబోడియా మొదలైన భాషలకు లిపి ప్రదానం చేసింది.తెలుగు దక్షిణ భాషా కుటుంబా నికి మూలం ద్రవిడం. దీనినుండి క్రీపూ 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించు కుందని పండితుల అభిప్రాయం. నేటి తెలుగు లిపికి ‘మాతృక’గా పరిణామక్రమం లో మొదటిదిగా ‘భట్టిప్రోలు లిపి’ ని పేర్కొంటారు.

స్థూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనదిగా చెబుతారు. భాషా పరిశోధకుల ఆభి ప్రాయం ప్రకారం ఈ లిపి క్రీపూ500 కాలంలో అభివృద్ధి చెందింది. తరువాత దక్షిణాపధంలో క్రీపూ300 నాటికి భట్టిప్రోలులో ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపించే రూపం సంతరించుకొంది. శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. గ, శ అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. భ, ద అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి.

ఘ, జ, మ, ల, ష అనే ఐదు అక్షరాలు చాలా వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. గ, మ అనే వర్ణాలు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కనిపించిన ‘ళ’ ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు. ఇంతటి చారిత్రక వైభవం కలిగిన భట్టిప్రోలు మనకు ప్రాచీనులు అందించిన జ్ఞానభండాగారమని చెప్పకతప్పదు.

శాసనాలు...
భట్టిప్రోలు శాసనాల్లోని భాష... ప్రాకృతం, లిపి... బ్రాహ్మీ భేదము. రాతిపేటికలు, స్ఫటికపు మంజూ షిక, వెండిరేకు, స్ఫటికపు పూసపైన 10 లేఖనాలు లభించాయి. ఈ శాసనాల వల్ల స్థానిక సభ దానధర్మాల్లో భాగస్వామ్యం వహించినట్లు తెలుస్తున్నది. సింహగోష్ఠి అనేది స్థానిక సంస్థ (నాలుగవ పేటిక). గోష్టి సభ్యులందరి పేర్లూ ఇందులో ఉన్నాయి. సింహగోష్ఠి అధ్యక్షుడు కుభీరకుడు (కుబేర, కుభిరక, కుభిర). బుద్ధుని శరీర ధాతువులు నిక్షిప్తం చేసేందుకు ‘కుర’ అనే అతడు పేటిక చేయించాడు (మూడవ పేటిక). ఐదవ పేటిక శాసనంలో ‘రాజా కుబేరక’ అని ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి