18, జనవరి 2013, శుక్రవారం

విశ్వ ధర్మ ప్రవర్తకుడు


 

 విశ్వ ధర్మ ప్రవర్తకుడు గౌతమ బుద్ధుడు


 
                విశ్వ ధర్మప్రవర్తకుడు, సకల భారత హృదయ చక్రవర్తి బుద్ధుడు. ఆ మహనీయుని దివ్య బోధనలు ప్రజాహృదయాలపై ప్రవహించి ధార్మిక ఫలాలను పండించాయి. ఆ తపోశ్రేష్టుడి దయాదృష్టి సకల జీవకారుణ్యానికి ప్రతీకగా నిలిచింది. బుద్ధుని జన్మస్థలం లుంబినీ వనం. క్రీ.పూ. 563వ సంవత్సరం, వైశాఖ పూర్ణిమ రోజున అతడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. ప్రజాపతి గౌతమి సిద్ధార్థ కుమారుని పెంచి పెద్ద చేసింది. ఆ కారణంగా ఆ మహనీయునికి గౌతమ సిద్ధార్థుడనే పేరు సార్థకమైంది. బుద్ధుడు మహాచక్రవర్తి. శుద్ధోను, మాయాదేవి కుమారుడైన సిద్ధార్థుడు యుక్తవయస్సులోనే ప్రాపంచిక విషయాలపట్ల ఆసక్తి కనబరచకుండా, భావశాంతికోసం తీవ్రమైన మేధోమధనం చేశాడు సిద్ధార్థునికి 28 సంవత్సరాల ప్రాయంలో. ఒకసారి వృద్ధుడ్ని, రోగిని, శవాన్ని, యతిని చూచి భౌతిక జీవనం పట్ల విరక్తి చెందాడు. శాశ్వతమైన ఆధ్యాత్మికతకు సంబంధించిన పరమార్థాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఇల్లు విడిచి పెట్టాడు. ఆ క్రమంలో ఎన్నో క్షేత్రాలను సందర్శించాడు. సందర్శించిన ప్రతీ ప్రాంతంలోనూ ఏవో సమస్యలు, అతని అంతర్మధనంలో కొత్త పరిష్కారాలకు తావిచ్చాయి. ఈ క్రమంలోనే మానవాభ్యుదయం, శాంతి సౌఖ్యాలకోసం బుద్ధుడుమార్గాన్ని అనే్వషించాడు. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం బుద్ధగయలో ఉన్న బోధి వృక్షం కింద తపస్సుచేసి జ్ఞానోదయాన్ని పొందాడు. ఈ క్రమంలో అతడు గౌతమ సిద్ధార్థుడు కాస్తా గౌతమ బుద్ధుడయ్యాడు. దీనినే ‘మహాసంబోధి’అని పిలవడం జరుగుతోంది. ఆ కారణంగా ప్రస్తుతమున్న రావివృక్షం (బోధి వృక్షం) బౌద్ధులందరికీ ఆరాధ్య వృక్షరాజమైంది. సమస్త మానవాభ్యుదయ విరోధం దుఃఖమని బుద్ధుడు తన సత్యసారమున చాటాడు. బుద్ధుడు నాలుగు ఆర్యసత్యాలను ప్రవచించాడు. దుఃఖము, దుఃఖ సముదయము, దుఃఖనిరోధము, దుఃఖ నివారణోపాయం అనే నాలుగు ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాల ద్వారా సాధించాలి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనము, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే ఈ ఎనిమిది అంశాలతో బౌద్ధ ధర్మం, మతం ఏర్పడింది. బుద్ధునిచే బోధింపబడిన ధర్మం కనుక బౌద్ధ్ధర్మం అయ్యింది. ఆ క్రమంలో బుద్ధుని ఆశ్రయించిన వారు బౌద్ధులయ్యారు. బుద్భుని రాకతో ప్రజలు మేల్కొన్నారు. క్రమంగా బుద్ధుని ధర్మాచరణ - సమత అన్నివర్గాల వారిని ఆకర్షించింది. ఈ నేపధ్యంలో బుద్ధుడు కులవ్యవస్థను నిరాకరించాడు. ధర్మాన్ని, జ్ఞానాన్ని పొందడానికి అందరూ అర్హులేనని ప్రకటించాడు. ఆకలితో ఉన్న వాడెవడూ ధర్మాన్ని తెలుసుకోలేడు. ఈ రహస్యాన్ని చేధించిన గౌతమబుద్ధుడు సమాజంలో అందరూ ఆకలిదప్పులు లేకుండా ఉండాల్సిన ప్రాథమిక అవసర సత్యాన్ని ఎలుగెత్తి చాటాడు. అలాగే కాషాయం కట్టినవాడు ప్రతి ఒక్కడూ గొప్పవాడు కాదని హెచ్చరించాడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాషాయం కట్టకూడదని, అలా కట్టేవాడు నియమాలను, సత్యాలను వంచించకూడదని బోధించాడు. బుద్ధుని బోధనలకు అనేకమంది ఆకర్షితులయ్యారు. తమ జీవన మార్గాలను విడిచిపెట్టి బుద్ధుడు బోధించిన అహింసా, శాంతి మార్గాలలో నడిచాడు. తన ఈ ధర్మప్రబోధానికిగాను బుద్ధుడు కోరి బాటనే ఎంచుకున్నాడు. అన్ని ప్రాంతాలకు పాదచారియై ప్రయాణిస్తూ చెట్లకింద నివాసం ఉంటూ, రోజూ భిక్షాటన చేసి, ఒక పూట మాత్రమే భోజనం చేసి, జీవితాన్ని, ధర్మాన్ని నియమబద్ధంగా నడిపాడు. ఈ క్రమంలో అనేకమంది దుర్మార్గులు సైతం సన్మార్గులుగా మారారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులలోనే ఆయన నిమ్నవర్గాలకు చెందిన ఉపాలి, సోపాకుడు, సుప్పియుడు, సుమంగలుడు, శకటాలుడు, డంకుడు, పృథక్కుడు తదితరులను తన శిష్యులుగా చేసుకున్నాడు. తన శిష్యుల సహకారంతో ధార్మిక చర్యలను, ప్రసంగాలను చేసేవాడు. ఎవరైతే ధ్యానానురక్తులై ధర్మానుష్టాన చిత్తులై సంఘశ్రేయస్సును కోరతారో వారే తమ ప్రియుష్యులని బుద్ధుడనేవారు. అహింసా, సత్యవ్రతాలతో దినరాత్రులు ఎవరైతే ధ్యాన నిరతులుంటారో వారే తమ శిష్యులని ప్రకటించారు. బుద్ధుడు అహింసను, శాంతిని బోధించాడు. మనల్ని పట్టిపీడిస్తున్న ద్వేషాన్ని ప్రతీ ఒక్కరూ విడిచిపెట్టాలని బుద్ధుడు బోధించాడు. ద్వేషంవల్ల ద్వేషం నశించదని, అది ప్రేమవల్లనే నశిస్తుందని ప్రబోధించాడు. ఇలా దీర్ఘకాలంపాటు అవిశ్రాంతంగా ప్రయాణం చేస్తూ బుద్ధుడు తన బోధనలు కొనసాగించాడు. ధర్మప్రచారంలో 80 ఏళ్ళవరకూ జీవించాడు. చివరికి కుశీనగరంలో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు. బుద్ధుని బోధనలు దేశ విదేశాల ప్రజలెందరినో ఆలోచింపచేసేలా చేశాయి. ఫలితంగా మరందరూ బౌద్ధం స్వీకరించే విధంగా ప్రేరేపించాయి. కులవ్యవస్థ నిర్మూలనకు, శాంతి స్థాపనకు ధర్మరక్షణమొక్కటే మార్గమని భావించిన మహనీయుడు బుద్ధుడు.
మనిషిని పట్టిపీడించే దుఃఖాన్ని పరిత్యజించిననాడే ధర్మరక్షణకు ఆత్మనివేదనకు మార్గం సుగమం అవుతుందని, అందువల్ల ఎవరికివారు ఆత్మశుద్ధిని చేసుకుని మానవాభ్యుదయానికి, శాంతిస్థాపనకు కృషిచేయాలని బుద్ధుడు ప్రబోధించాడు. లుంబినీ వనంలో పుట్టి, బుద్ధగయలో జ్ఞానం పొంది, ‘సారనాథ్’లో ధర్మప్రబోధం చేసి, కుశీనగరంలో మహా పరినిర్యాణం చెందిన బుద్ధుని జీవనం సదా స్మరణీయం. ఆయన బోధనలు, ధర్మస్థాపనకు ఆయన అనుసరించిన మార్గాలు సదా ఆచరణీయం. ఆ మహనీయుని బోధనల సారాన్ని గ్రహించి విశ్వమానవ కళ్యాణానికి పాటుపడడమే మనందరి కర్తవ్యం.
                    బుద్ధం శరణం గచ్ఛామి
                        ధర్మం శరణం గచ్ఛామి
                               సంఘం శరణం గచ్ఛామి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి