18, జనవరి 2013, శుక్రవారం

పరివర్తన

బందిపోటులో పరివర్తన తెచ్చిన

బుద్ధుడు

.


సిద్ధార్థునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచపు లీల ఆయనకు పూర్తిగా తెలిసివచ్చింది. శరీరపు అణువణువునా ఆశ్చర్యం ఉట్టిపడుతూండగా ఆయన ఘోషించాడు: "ఓహో! ఇదంతా ఎక్కడ మొదలౌతున్నదో, ఎలా పని చేస్తున్నదో, దీనికి తాళంచెవి ఎక్కడున్నదో నాకు తెలిసిపోయింది! నేను ఇక తలుపులు తెరచి, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విహరిస్తాను" అని. ప్రేమ, కరుణలతో నిండిన ప్రశాంత చిత్తంతో ఆయన 50 సంవత్సరాలపాటు గ్రామగ్రామాలా కాలినడకన తిరిగి, తన అనుభవాన్ని ఎదురైన ప్రతి ఒక్కరితోటీ పంచుకున్నాడు. లక్షలాదిమంది ఆయన శిష్యులై మేలుగాంచారు.
బుద్ధుడు బోధ మొదలుపెట్టిన తొలిదినాలలో, ఒకసారి ఆయన ఒంటరిగా ఒక అడవిదారిన పోతున్నాడు. అంతలో తన వెనుకనుండి ఎవరో తనపై దాడిచేస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాడు. రెండు చేతులు ఆయన్ని బలంగా బంధిస్తున్నాయి. బుద్ధుడు వెంటనే ఆ వ్యక్తి నుండి విదిలించుకొని నిర్భయంగా నిలబడ్డాడు. చూస్తే, వచ్చింది ఒక బందిపోటు దొంగ! కండలు తిరిగిన ఆ దొంగ నడుముకు ఒక చురకత్తి వేలాడుతున్నది. ముఖంలో క్రూరత్వం ఘనీభవించినట్లు మెలితిరిగిన మీసం ఉన్నది.
"నిన్ను చూస్తే ధైర్యసాహసాలున్న యువకుడిలాగే ఉన్నావు. కానీ ఇలా పిరికివానిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?" అని అడిగాడు బుద్ధుడు.
"నువ్వు వినలేదా నా గురించి? నేనే చంగాను! ఈ ప్రాంతంలో పసిపిల్లలుకూడా `చంగా' అన్న పేరు వినగానే నోరుమూసుకుంటారు. ఊ, నీదగ్గర ఉన్న సంపదనంతా తీసి ఇచ్చెయ్. లేదా, నీ తల నీ మెడపై ఉండదు. జాగ్రత్త! త్వరగా ఇచ్చెయ్" అన్నాడు బందిపోటు, కత్తిని తళతళలాడిస్తూ. బుద్ధుని ప్రవర్తనలో భీతి లేదు. ఆయన శరీరం ప్రశాంతతను, ఓజస్సును వెలువరిస్తున్నది. గమనించిన బందిపోటులో ఆశ్చర్యం మొదలైంది. ఇలాంటి వ్యక్తిని ఇంతకు ముందు ఎన్నడూ తను చూసి ఉండలేదు. అయినా తన ఆలోచనల్ని ముఖంలోకి రానివ్వకుండా కరుకుగా అన్నాడు "ఈ చంగాను మించిన వీరుడు ఈ ప్రాంతంలోనే లేడు. పిరికితనం గురించి నాతో మాట్లాడకు. దమ్ముంటే నా ధైర్యానికి ఏదైనా పరీక్షపెట్టు చూద్దాం!" అని.
బుద్ధుడు నిర్భయంగా, ప్రశాంత కరుణతో అన్నాడు - "తలలు నరికెయ్యటం అనేది ధైర్యవంతులు చేసే పనికాదు. అదిగో, ఆ రావి చెట్టు ఆకు ఒకటి కోసుకొనిరా" అని. బందిపోటు కోసుకొచ్చాడు. "సరే, ఇప్పుడు వెళ్లి, ఈ ఆకును దాని స్థానంలోనే తిరిగి చెట్టుకు అతికించు" ఆదేశించాడు బుద్ధుడు.
"అది వీలవదు" అన్నాడు చంగా, కలవరపడుతూ. ఇదంతా ఎటు పోతున్నదో అతనికి అర్థం కాలేదు.
"అవునుమరి" అంటూ చెప్పాడు బుద్ధుడు -"దేన్నైనా విరగగొట్టడం సులభం, కలపటం కంటే. అందుకనే పిరికివాళ్లు చంపుతారు, బాధపెడతారు, వైరుధ్యాలను ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో వారికి తెలీకుండానే వారు తమలో బాధను, దు:ఖాన్ని నింపుకుంటారు. శౌర్యవంతులు, దీనికి భిన్నంగా ఉంటారు. వారు సరిచేస్తారు, నయం చేస్తారు, సమస్యల్ని పరిష్కరిస్తారు, సుఖశాంతులందిస్తారు. ప్రతిఫలంగా వాళ్లకూ సుఖశాంతులు లభిస్తాయి. వాళ్లు గనక సత్యాన్ని నిజంగా గ్రహిస్తే, తమ మనస్సును, శరీరాన్ని నిజాయితీతో గమనిస్తే, జన్మ, మృత్యు, జరా, రోగ చక్రం నుండి విముక్తులవ్వగలరు".
ఒకసారి ఇదంతా చెప్పేశాక, బుద్ధుడు యధాప్రకారం నిర్మలంగా నడుచుకొని ముందుకు వెళ్లిపోయాడు.
చంగాలో సంచలనం రేగింది. వదులైన నడుమునుండి పటకాకత్తి జారికింద పడింది. ఒక్క క్షణం సంకోచంగా ఆగిన పిమ్మట, అతను బుద్ధుని వెనక, అదే మార్గంలో నడక సాగించాడు. బుద్ధుని శిష్యుడై, కాల క్రమంలో పరిశుద్ధ మనస్కుడైనాడు. 
 మూలం: పర్తాప్ అగర్వాల్

1 కామెంట్‌: