గౌతముడు
క్రీ.పూ 563లో రాజకుటుంబంలో పుట్టాడు. సిద్ధార్థుడికి చిన్నప్పటి నుండి
తాత్త్విక చింతన మెండుగా ఉండేది. ఏ ప్రాణికి ముప్పు కలిగినా, బాధ కలిగినా
సహించేవాడు కాదు. అది గమనించిన గౌతముని తండ్రి శుద్ధోధనుడు, ప్రత్యేకంగా
ఏర్పాటు చేసిన మందిరంలో గౌతముడిని పెంచాడు. ఎన్ని జాగ్రత్తలు
తీసుకున్నప్పటికీ గౌతముడి తాతగారు వయోభారంతో అస్వస్థతకు గురవడం, క్రమంగా
క్షీణించి చివరికి మరణించడం... గౌతముడిలో తిరిగి చావుపుట్టుకల గురించిన
సందిగ్ధం, సంఘర్షణకు కారణమయ్యాయి. ఈ అన్వేషణలో భాగంగా దేశాటన చేశాడు.
నాలుగు దఫాలుగా రాజ్యం నాలుగు దిక్కులూ పర్యటించాడు.
మూడుసార్లు
గౌతముడికి రాజ్యంలో ప్రజల బాధలు, రోగాలు, మరణాలు వంటివే కనిపించాయి.
‘‘ప్రపంచం ఇంతటి విషాదంలో నిండి ఉంటే నేను వైభవోపేతమైన జీవితాన్ని
అనుభవించడం ధర్మమేనా?’’ అనే ఆలోచన గౌతముని మదిలో మెదలసాగింది. ఈ నేపథ్యంలో
సాగిన నాలుగో పర్యటనలో ఒక సన్యాసిని చూడడం తటస్థించింది. గౌతముడికి సమాధానం
అప్పుడు దొరికింది. అప్పటి వరకు అతడి మనోసాగరంలో జరిగిన అలజడి సన్యాసి
దర్శనంతో నెమ్మదించసాగింది. ఆలోచనలకు ఒక రూపం రాసాగింది. చివరికి తన 29వ ఏట
అంతఃపురాన్ని వదిలి వెళ్లాడు. అప్పటి నుంచి గౌతముడి శోధన సత్యాన్వేషణకే
జరిగింది. ఆ శోధనలో అనేక అంశాలను సంగ్రహించాడు.జీవించడానికి అనుసరించాల్సిన
త్రిరత్నాలను బోధించాడు. అవి...
‘బుద్ధం శరణం గచ్ఛామి’ (బుద్ధి మనసుకు దారి చూపించే మార్గదర్శి) ‘ధర్మం శరణం గచ్ఛామి’ (ధర్మం అనేది మనిషి నడవాల్సిన దారి) ‘సంఘం శరణం గచ్ఛామి’ (సంఘం అంటే మనతోపాటు జీవించే తోటి మానవులతో కూడిన సమూహం) ప్రతి ఒక్కరూ ఈ మూడింటినీ తప్పక అనుసరించాలని చెప్పాడు. సుత్త,
వినయ, అభిదమ్మ అనే త్రిపిటకాలతోపాటు జీవన విధానాన్ని సూచిస్తూ,
ఆచరించకూడని వాటిని కూడా స్పష్టంగా చెప్పాడు. వాటిని ఐదు అంశాలుగా విభజించి
పంచసూత్రాలుగా ఉపదేశించాడు. అవి ‘ఇతరులకు ప్రాణహాని తలపెట్టడం, వస్తువులను
అపహరించడం, విశృంఖల శృంగారం, అసత్యమాడడం, మత్తుపదార్థాలను సేవించడం’. బుద్ధుని ప్రధాన జీవన మార్గం
సత్యాన్ని పాటిస్తూ ధర్మమార్గంలో జీవిస్తూ మరణం కోసం వేచి చూడడం. అలాగని
మరణంతో జీవితం ముగుస్తుందన్న వాదాన్ని అంగీకరించదు బౌద్ధం. జీవితం
ఆరుదశలుగా ఉంటుందని చెబుతుంది. వీటన్నింటినీ దాటుకుని ఉత్తమదశకు చేరడం అంటే
స్వర్గాన్ని చేరడమే. అక్కడ అంతా సంతోషమే ఉంటుంది. స్వర్గాన్ని చేరాలంటే
ముందుగా జీవించాల్సిన ఆరు జన్మలలో తగిన అర్హతను సాధించాల్సి ఉంటుంది. ఆరు
జన్మలంటే దైవత్వం, దానవత్వం, మానవత్వంతో పాటు జంతువులుగా కూడా జన్మించాల్సి
ఉంటుంది. ఇవన్నీ కర్మానుసారం సంభవిస్తాయి. ఈ దశలన్నీ జీవికి దుర్భరమైన
వేదనలను కలిగిస్తాయి. ఈ వేదనలకు తలవంచి మోహానికి లోబడి సత్యాసత్య,
ధర్మాధర్మాలను విస్మరించకుండా జీవించడమే బౌద్ధం సూచించే జీవనశైలి. తోటి
మానవులను ప్రేమించటం, దుఃఖాలకు మూలమైన కోరికలను విడనాడటం, జీవహింస,
అబద్ధాలు, దొంగతనాలు, మత్తుపదార్థాల జోలికి వెళ్లనని ప్రతిజ్ఞ చేయడం వల్ల
మానవాళి వెలుగుబాటలోకి పయనించగలదని, ఆయన నమ్మాడు, ఆచరించాడు, బోధించాడు.
విశ్వమానవ శ్రేయస్సు కోసం ఆయన రూపొందించిన పంచశీలాలు మానవాళికంతటికీ
ఆదర్శప్రాయమైనాయి. బౌద్ధగ్రంథాలను త్రిపిటకాలు అంటారు. పిటకం అంటే గంప అని
అర్థం. శ్రామికులు గంపలో మట్టిని నింపి ఒకరి చేతుల మీదుగా మరొకరు ఎలా
అందుకొంటారో, అదేవిధంగా జ్ఞానజ్యోతిని భావితరాలకు వినయపిటకం, సుత్త పిటకం,
అభిదమ్మ పిటకం అనే గ్రంథాల ద్వారా మానవాళికి అందించాడు. శాంతంతో
కోపాన్ని, సాత్వికతతో హింసను, దానంతో లోభాన్ని, ప్రేమతో ద్వేషాన్ని సత్యంతో
అసత్యాన్ని జయించండి, సర్వప్రాణుల పట్ల సానుభూతి కలిగి ఉండటటమే నిజమైన
ధర్మము లేక మతము అని ఆయన బోధించాడు. కేవలం బోధించటమే కాదు, తన బోధనలను తానే
జీర్ణం చేసుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. బుద్ధుని బోధనలు మానవుని
పవిత్రమైన, ధర్మబద్ధమైన జీవనానికి దారి చూపాయి. అందుకే ఈ ప్రపంచమంతా ఆయనను
అవతార పురుషునిగా భావించింది. ఆయన జన్మించి ఇన్ని సంవత్సరాలు అయినా ఆయన
చూపిన మార్గం ఇంకా అనుల్లంఘనీయంగా భాసిల్లుతోంది. ఆ మార్గాన్ని అనుసరించిన
ప్రతి ఒక్కరూ బౌద్ధులే. ప్రతి ఒక్కరూ బోధిసత్త్వులే. అసలు నిజం ఇది
గౌతమ బుద్ధునిపై ఒక నింద ప్రచారంలో ఉంది. అదేమంటే అర్ధరాత్రి సమయంలో భార్య
యశోధర ను, కుమారుడు రాహులుడిని వదిలి వెళ్లిపోయాడని. అది నిజం కాదు. అది
కేవలం అపనింద మాత్రమే. వాస్తవానికి ఆయన తనలో సమాజ సంక్షేమం పట్ల ఎంతోకాలం
నుంచి ఆలోచనలు రగులుతుండగానే తండ్రికి, భార్యకు, కుమారునికి, తాను ఇక
కుటుంబ జీవనం సాగించదలచుకోలేదని, ప్రపంచ ంలోని దుఃఖాన్ని తొలగించగలిగే
మార్గాలను కనుగొనేందుకు అన్వేషణ సాగించదలచానని, ఏ క్షణంలోనైనా ఆ ప్రయత్నంలో
ముందుకు సాగుతానని, కాబట్టి అనుమతి ఇవ్వవలసిందని చెప్పాడు. మొదటగా వారు
అంగీకరించకపోయినప్పటికీ గౌతముని పట్టుదల, దృఢసంకల్పానికి ముగ్ధులై అందుకు
సమ్మతించారు. ఆ తర్వాతనే గౌతముడు అంతఃపురాన్ని వదిలి వెళ్లిపోయాడు.
-------------------------------------------------------------- ఎప్పుడో
2555 ఏళ్ళ క్రితం చెప్పిన బుద్ధుని సిద్ధాంతాలు ఈ ఆధునిక ప్రపంచానికి
చెల్లుబాటు అవుతాయా అని చాలామంది సందేహం. నాటి జీవన విధానానికి, నేటి జీవన
విధానానికి అసలు పొంతన లేదు. నాడు రాచరికం ఉంటే నేడు ప్రజాస్వామ్యం ఉంది.
అటు జనరిక పాలన అవినీతి, ఇటు భౌతిక సుఖలాలస జనాన్ని ఓల లాడిస్తుంటే నేటి ఈ
సమాజానికి మోక్షం ఎక్కడ? అనేదానికి బుద్ధుడు చెప్పిన ఆచరణాత్మక పరిష్కార
మార్గమే ధమ్మపదం. అంటే మనసే అన్నింటికి మూలం. అంటే అన్ని శక్తులలోకి
మనోశక్తి బలమైంది. దీనిని సాధించాలంటే మనసు పని చేసే తీరుతెన్నులను
పరిశీలించాలి. ఇది మంచి శీలం (నడత), ధ్యానం మీద ఆధారపడిన అంతరంగ పరిశీలన
ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. - బుద్ధఘోషుడు (అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి), బౌద్ధధర్మ పరిశోధకులు
|
Great man
రిప్లయితొలగించండి