18, జనవరి 2013, శుక్రవారం

బౌద్ధ మత ఆవిర్భావం.


బౌద్ధ మత ఆవిర్భావం.. తదనంతర పరిణామాలు
 
క్రీస్తు పూర్వం ఆరో శతాబ్ధంలో ఆవిర్భవించిన నూతన మతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మతం బౌద్ధం. ఉత్తర భారత దేశంలో సాంఘిక, ఆర్థిక జీవనంలో చోటు చేసుకున్న మార్పులు, వైదిక కర్మకాండల పట్ల వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో ఆవిర్భవించిన బౌద్ధం..దేశ మంతటా విస్తరించింది. మన పొరుగు దేశాలకు కూడా విస్తరించింది ఆసియా ఖండంలో ఒక బలమైన తాత్విక సాంప్రదాయంగా స్థిరపడటం విశేషం.

బుద్ధుని జీవిత క్రమం:
క్రీస్తు పూర్వం 563లో కపిలవస్తు నగర సమీపంలోని ‘లుంబినీ’గ్రామం (ప్రస్తుత నేపాల్‌లోని ప్రాంతం)లో జన్మించిన బుద్ధుడి అసలు పేరు సిద్ధార్ధుడు. శాక్య తెగను పాలిస్తున్న శుద్ధోధనుడు ఇతని తండ్రి. మహామాయ తల్లి.

ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. చిరు ప్రాయంలోనే ‘యశోధర’ అనే సమీప బంధువును పెళ్లి చేసుకున్న సిద్ధార్ధుడికి.. కొంతకాలం గృహస్థు జీవనం సాగించాక తీవ్ర అశాంతి ఏర్పడింది. ఒక రోజు చెన్నుడి సారథ్యంలో రథంలో విహరిస్తున్న సిద్ధార్ధుడికి కనిపించిన దృశ్యాలు (వృద్ధుడు, రోగి, శవయాత్ర) అతణ్ని తీవ్రంగా కలచివేశాయి. తర్వాత కనిపించిన నాలుగో దృశ్యం.. ప్రశాంత వదనంతో, అలౌకిక ఆనందంతో సంచరిస్తున్న సన్యాసి.

ఈ నాలుగు దృశ్యాలు సిద్ధార్ధుడికి దిశానిర్దేశం చేశాయి. ఈ నేపథ్యంలోనే యశోధర ‘రాహులుడికి’ జన్మనిచ్చింది. కుమారుడి జన్మదినాన సిద్ధార్ధుడు తన 29వ ఏటా రాజ్యా న్ని కుటుంబాన్ని విడిచి సన్యాసిగా మారాడు. తన యజమాని వియోగాన్ని తట్టుకోలేని ప్రియ అశ్వం ‘కంథక’ మరణించింది. సిద్ధార్ధుడు ఇల్లు విడిచి వెళ్లటాన్నే బౌద్ధులు ‘మహాభినిష్ర్కమణ’ అని వ్యవహరిస్తారు.

ఆ తర్వాత సిద్ధార్ధుడు ‘ఆలార కాలామ’ అనే గురువు వద్ద ధ్యాన సాధనలో శిక్షణ పొందాడు. తదనంతరం అయిదుగురు సన్యాసులతో కలసి కఠోర సాధనలు చేస్తూ.. శరీరాన్ని శుష్కింప చేసుకున్నాడు. కానీ ఆ సాధనల వల్ల ప్రయోజనం లేదని తెలుసుకుని మళ్లీ ఆహారాన్ని తీసుకున్నాడు. శారీరక బలాన్ని పొందాడు.

35వ ఏటా మగధను బింబిసారుడు పాలిస్తున్న కాలంలో గయ పట్టణ శివార్లలో, ‘సుజాత’ అనే పల్లెపడుచు తెచ్చిన ఆహారాన్ని స్వీకరించాక, ఒక పెద్ద బోధి వృక్షం కింద ధ్యాన నిమగ్నుడయ్యాడు. 49 రోజుల ధ్యానం తర్వాత సిద్ధార్ధుడికి జ్ఞానోదయం కలిగింది. దాని ఫలితమే సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారడం. ఆ తర్వాత సారనాథ్‌లోని హరిణవనంలో ఒకప్పటి తన అయిదుగురు సహచరులకు తాను పొందిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. దీనినే ‘ధర్మ చక్ర ప్రవర్తన’ అంటారు.

క్రమంగా బుద్ధుడి బోధనలు ప్రచారం పొందుతూ, ఎందరినో ఆకర్షించాయి. అ క్రమంలోనే బౌద్ధ సంఘం ఏర్పడింది. ఆ విధంగా 40 సంవత్సరాలకు పైగా బుద్ధుడు ధర్మ ప్రచారం చేశాడు. చివరికి 80వ ఏటా క్రీస్తు పూర్వం 483లో కుసీనగర్ అనే ప్రాంతంలో మరణించాడు. ఈ సంఘటననే బౌద్ధ పరిభాషలో ‘మహా పరినిర్వాణ’గా వ్యవహరిస్తారు.

బుద్ధుని బోధనలు:
తన సమకాలీన వాస్తవికతను సవ్యంగా అవగాహన చేసుకుని, దానిని సంస్కరించే ప్రయత్నం చేశాడు బుద్ధుడు. ఆత్మ, బ్రహ్మల గురించి నడుస్తున్న రాద్ధాంతాలను పట్టించుకోలేదు. నాలుగు గొప్ప సత్యాలను గుర్తించాడు. అవి..

1. {పపంచం దుఃఖమయం
2. దుఃఖానికి మూలం కోరిక
3. కోరికలను జయిస్తే దుఃఖం నివారణై నిర్వాణం సిద్ధిస్తుంది.
4. దుఃఖాన్ని నివారించేందుకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి.

అష్టాంగ మార్గం:
1. సమ్యక్ దృష్టి
2. సమ్యక్ నిశ్చయం
3. సమ్యక్ వాక్కు
4. సమ్యక్ క్రియ
5. సమ్యక్ జీవనం
6. సమ్యక్ సాధన
7. సమ్యక్ స్మృతి
8. సమ్యక్ సమాధి

ఈ ఎనిమిది సూత్రాలు అవగతం చేసుకుని, ఆచరించిన వ్యక్తికి ‘నిర్వాణం’ సిద్ధిస్తుంది. అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి. బుద్ధుడు విలాస జీవనాన్ని, కఠోర క్రమశిక్షణను తిరస్కరించాడు. బౌద్ధం అన్నింటిలోనూ ‘మితం’గా ఉండటం వల్లే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. బుద్ధుడు తన అనుచరులకు కొన్ని సాంఘిక ప్రవర్తన నియమాలను రూపొందించాడు. అవి..

1. ఇతరుల ఆస్తిని ఆశించకూడదు.
2. అహింసను పాటించాలి
3. మత్తు పదార్థాలు సేవించకూడదు.
4. అబద్ధాలు ఆడరాదు.
5. అవినీతి చర్యలకు పాల్పడకూడదు.

బుద్ధుని జీవితానికి సంబంధించి అయిదు ప్రధాన ఘట్టాలను బౌద్ధులు పంచకళ్యాణులుగా భావిస్తారు. అవి..
1. బుద్ధుడి జననం 2. మహాభినిష్ర్కమణం 3. సంబోధి (బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం) 4. ధర్మచక్ర ప్రవర్తన 5. మహా పరినిర్వాణం

బౌద్ధ సంగీతులు:
బౌద్ధ సంఘంలోని సైద్ధాంతిక వాదోపవాదాలను పరిష్కరించుకునేందుకు జరిగిన సమావేశాలనే ‘సంగీతుల’అని వ్యవహరించే వారు.

మొదటి సంగీతి: బుద్ధుని మరణానంతరం అజాత శత్రువు పాలనా కాలంలో క్రీస్తు పూర్వం 483లో ‘రాజగృహ’ సమీపంలో మహాకస్యపుడి అధ్యక్షతన జరిగింది. బుద్ధుని శిష్యుల్లో ముఖ్యుడైన ఉపాలి ‘వినయ పీటిక’ను, ఆనందుడు ‘సుత్త పీటిక’ను క్రోడీకరించారు.

రెండో సంగీతి: బుద్ధుడు మరణించిన వందేళ్లకు అంటే క్రీస్తు పూర్వం 383లో వైశాలిలో ‘సబకామి’ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బౌద్ధ సంఘం ‘స్థవిరవాదులు’, ‘మహాసాంఘికులు’గా చీలింది.

మూడో సంగీతి: అశోకుని పోషణలో పాటలీపుత్రంలో మొగలి పుత్తతిస్స అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్థవిరవాదులు పైచేయి చాటుకున్నారు. ఈ సమావేశంలోనే త్రిపీటికాల చివరి భాగం- అభిదమ్మ పీటికలోని ‘కథావత్తు’ సంకలనం చేశారు.

నాలుగో సంగీతి: కనిష్కుని కాలంలో కాశ్మీర్‌లో వసుమిత్రుడు, అశ్వఘోషుల అధ్యక్షతన జరిగింది. బౌద్ధ సంఘం హీనయాన, మహాయాన శాఖలుగా చీలింది.

బౌద్ధ మత సాహిత్యం:
వినయ పీటిక: బౌద్ధ సంఘ ప్రవర్తన, క్రమశిక్షణకు సంబంధించి బుద్ధుడు రూపొందించిన నియమావళి.

సుత్త పీటిక: త్రిపీటకాల్లో విస్తృతమైంది, ముఖ్యమైంది. దీనిలో అయిదు భాగాలున్నాయి. అవి..
1. దీర్ఘ నికాయ 2. మధ్యమ నికాయ 3. సంయుక్త నికాయ 4. అంగుత్తర నికాయ 5. ఖుద్దక నికాయ.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన జాతక గాధలు ‘ఖుద్దక నికాయ’లోనే నిక్షిప్తమయ్యాయి.

అభిదమ్మ పీటిక: బౌద్ధులు వృద్ధి చేసిన అధిభౌతిక, మనస్తత్వ విజ్ఞానం ఇందులో సంకలనం చేశారు.
ఈ త్రిపీటకాలన్నీ పాలీ భాషలోనే ఉన్నాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్ధంలో ఆవిర్భవించిన ‘మహాయానం’ సంస్కృత భాషను స్వీకరించింది. మహాయానం ‘వైఫల్య సూత్రాలు’ పేరిట కొంత సాహిత్యాన్ని సృష్టించింది. అందులో ముఖ్యమైనవి..
అష్ట సహస్రిక ప్రజ్ఞా పారమిత, సద్ధర్మ పుండరీక, లలిత విస్తార.

బౌద్ధ మేధావులు: అశ్వఘోషుడు: కనిష్కుని సమకాలీనుడు. కవి, వాగ్గేయకారుడు, నాటక రచయిత, పండితుడు, మహా వక్త. ఈయన కాలినడకన పట్టణాలు, పల్లెలు సంచరించి బౌద్ధ మత ప్రచారం చేశాడు.

నాగార్జునుడు: యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో శ్రీపర్వతం (దీనికే నాగార్జున కొండ అని పేరు) వద్ద నివసించాడు. మాధ్యమిక వాదాన్ని ప్రవచించాడు. దీనికే శూన్యవాదం అని పేరు వచ్చింది.
అసంగుడు: నాలుగో శతాబ్ధంలో పంజాబ్ ప్రాంతంలో జీవించాడు. మైత్రేయనాధుడు స్థాపించిన యోగాచార లేదా విజ్ఞాన వాద శాఖను ప్రచారం చేశాడు.

వసుబంధుడు: అసంగుని సోదరుడు. ఇతడు రాసిన ‘అభిదమ్మ కోశ’ను బౌద్ధ విజ్ఞాన సర్వస్వంగా భావిస్తున్నారు.

బుద్ధఘోషుడు: అయిదో శతాబ్ధంలో జీవించిన పాలీ విద్వాంసుడు. ఇతడు రచించిన ‘విశుద్ధిమార్గ’ త్రిపీటకాలను అవగతం చేసుకునేందుకు కీలకమైంది.

అయిదో శతాబ్ధంలోనే జీవించిన బుద్ధపాలితుడు భావ వివేకుడు. నాగార్జునుడి ‘శూన్య వాదాన్ని’ విస్తృతపరిచారు. ఈ శతాబ్ధానికే చెందిన దిగ్నాశుడు తర్కంపై సుమారు వంద రచనలు చేసి ప్రసిద్ధి పొందాడు. ఏడో శతాబ్ధంలో జీవించిన ధర్మకీర్తి మరో గొప్ప తార్కికుడు. గాఢ తాత్విక చింతన, గతితర్కంతో ‘కాంట్ ఆఫ్ ఇండియా’ (Kant of India) గా ప్రశంసలు పొందాడు.

బౌద్ధ మత శాఖలు:
బుద్ధుడు జీవించినప్పుడు ఆయన బోధనలు అక్షరబద్ధం కాలేదు. దీంతో ఆయన మరణించాక తలెత్తిన విభేదాల కారణంగా బౌద్ధ మత సిద్ధాంతాలు, సూత్రాలు, బౌద్ధ సంఘం శాఖోపశాఖలుగా చీలింది.

బుద్ధుడు మరణించిన వందేళ్లకు జరిగిన రెండో సంగీతిలో బౌద్ధ సంఘం ‘స్థవిరవాద’, ‘మహా సాంఘిక’ శాఖలుగా చీలింది. అశోకుని కాలానికి బౌద్ధంలో 18 శాఖలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వివాదాల పరిష్కారం కోసమే అశోకుడు మూడో సంగీతిని ఏర్పాటు చేశాడు. కనిష్కుని కాలానికి మహా సాంఘికులే ‘మహాయాన శాఖ’ఏర్పాటుకు కారణమయ్యారు.

మహాయానం:
మౌర్యానంతర యుగం (క్రీస్తు పూర్వం 200- క్రీశ 300) లో సంభవించిన సామాజిక పరిణామాలు మహాయాన ఆవిర్భావానికి దారి తీశాయి. ఎన్నో విదేశీ తెగలు బౌద్ధాన్ని స్వీకరించడం, బౌద్ధ సంఘంలో సంపద పేరుకుపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ‘సంఘం’లో తలెత్తిన విభేదాలు మహాయానానికి దారి తీశాయి.

మహాయానం ‘బోధి సత్య భావన’కు విస్తృత ప్రచారం కల్పించింది. దానాలు చేసి పుణ్యం పొందొచ్చని, పుణ్యాన్ని బదిలీ చేయొచ్చని ప్రచారం చేసింది. మహా యానం బుద్ధుడిని దేవుడిగా మార్చింది. భారతదేశంలో విగ్రహారాధన ప్రబలమవడానికి మహాయానమే కారణం.

మహాయానం విపరీత పోకడలో వజ్రయానానికి దారితీసింది. వజ్రయానం బుద్ధుడికి తోడుగా ‘తారా’ అనే స్ర్తీ దేవతలను సృష్టించింది. లైంగిక సాధనల వంటి చర్యలతో బౌద్ధం ప్రతిష్ట మసకబారింది.

బౌద్ధమత ప్రాచుర్యం:
బౌద్ధమతంలోని నిరాడంబరత్వం సామాన్యులను విశేషంగా ఆకర్షించింది. వర్ణ వివక్షను నిరసించడం ద్వారా బ్రాహ్మణేతర వర్ణాల్లో విశేష ప్రాచుర్యం పొందింది. బుద్ధుని వ్యక్తిత్వం, సంభాషణ శైలి బౌద్ధానికి విశేష ప్రచారం తీసుకొచ్చాయి. బౌద్ధ సంఘం ఎంతో ఆసక్తితో, క్రమశిక్షణతో మత ప్రచారానికి పాటుపడింది. జన సమాన్యంలో ప్రచారంలో ‘పాలీ’ భాషను వినియోగించడం ద్వారా కూడా బౌద్ధం విశేష ప్రాచుర్యం పొందింది. ఇక, అశోకుడ, కనిష్కుడు, హర్షుడు వంటి చక్రవర్తులు కూడా ఆరాధించడం వల్ల ఉపఖండంతోపాటు, విదేశాలకూ సైతం బౌద్ధ మతం విస్తరించింది.

బౌద్ధమత క్షీణత:
క్రీస్తు శకం ఆరో శతాబ్ధం నాటికే బౌద్ధం క్షీణత ప్రారంభమైంది. క్రీస్తు శకం 12వ శతాబ్ధం నాటికి బౌద్ధం భారతదేశం నుంచి అంతర్ధానమైంది. ఒకప్పటి నిరాడంబరత్వాన్ని, మౌలిక సిద్ధాంతాలను బౌద్ధం విడిచిపెట్టడం, ‘పాలీ’ భాషకు బదులు సంస్కృతాన్ని స్వీకరించడం, బౌద్ధ సంఘం శాఖోపశాఖలుగా చీలిపోవడం.. శంకరాచార్య, కుమారభట్టు తదితరులు హిందూమతాన్ని సంస్కరించి, శక్తిమంతం చేయడం, బౌద్ధంపై అన్యమతస్తుల (ముఖ్యంగా శైవులు) దాడులు.. వంటి ఎన్నో కారణాలతో బౌద్ధం క్షీణించింది.

20వ శతాబ్ధంలో డా॥బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించి, గొప్ప సమతా సిద్ధాంతంగా, ప్రజాస్వామిక భావనగా బౌద్ధానికి తిరిగి ప్రచారం కల్పించడంలో సఫలమయ్యాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి